ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం నిర్వహించాలి
జైనూర్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని జైనూర్ సీఐ రమేష్ (Jainoor CI Ramesh)కోరారు. జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్ సూచనలతో మంగళవారం జైనూర్‌లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.జైనూర్ పోలీస్ స్టేషన్ నుంచి మండల కేంద్రంలోని ప్రధాన రహదారులు, వివిధ వీధుల మీదుగా ఫ్లాగ్ మార్చ్ కొనసాగింది. ఈ సందర్భంగా సీఐ రమేష్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనాన్ని భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు.
నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. మద్యం సేవించి ర్యాలీలో పాల్గొని అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.నిమజ్జన ర్యాలీతో పాటు నిమజ్జన ప్రదేశాల్లో విధులు నిర్వహించే పోలీసులకు గణేష్ ఉత్సవ కమిటీలు, యువత, భక్తులు సహకరించాలని కోరారు. పోలీసుల సూచనలు, నిబంధనలు పాటిస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోవాలని సూచించారు.ఫ్లాగ్ మార్చ్‌లో జైనూర్ ఎస్సై రవికుమార్, సిర్పూర్(యు) ఎస్సై కొమురయ్య, లింగాపూర్ ఎస్సై సురేష్, ఆర్‌ఎస్ఐ మోహన్, ఏఆర్‌ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.