నేడు టీడబ్ల్యూజేఎఫ్ పాదయాత్ర విజయోత్సవ సభ
ఇండ్ల స్థలాల సాధనే లక్ష్యంగా ఖమ్మంలో నేడు యాత్ర
అర్బన్ తహశీల్దారు ఆఫీస్ నుంచి రఘునాథపాలెం వరకూ
జర్నలిస్టులు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున తరలాలని పిలుపు
ఖమ్మం,(విజయక్రాంతి): ఇండ్ల స్థలాల సాధనే లక్ష్యంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్(Telangana Working Journalists Federation) టీడబ్ల్యూజేఎఫ్, హెచ్- 2843 ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర శనివారం ఖమ్మం నియోజకవర్గంలో ముగుస్తుందని టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్ ఖదీర్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల మండల కేంద్రాల్లో నిర్వహించిన పాదయాత్ర విజయవంతం అయిన నేపథ్యంలో ఖమ్మం వైరా రోడ్డులోని ఎస్ ఆర్ గార్డెన్ పార్కింగ్ స్థలంలో విజయోత్సవ సభను శనివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
చివరిరోజు పాదయాత్ర షెడ్యూల్ తో పాటు ముగింపు సభను విజయవంతం చేయాల్సిందిగా శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. చివరి రోజు పాదయాత్రలో భాగంగా ముందుగా జడ్పీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి(Ambedkar statue) పూలమాల వేసిన అనంతరం ఉదయం 9 గంటలకు అర్బన్ తహశీల్దార్ కు వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. అక్కడి నుంచి కాల్వవొడ్డు, రైల్వే ఓవర్ బ్రిడ్జి మీదుగా మయూరిసెంటర్లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం బస్ డిపో రోడ్డు, రాపర్తి నగర్, కొత్త బస్టాండ్ మీదుగా పాదయాత్ర సాగుతుందని వివరించారు.
ఎన్టీఆర్ సర్కిల్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి(Telangana Talli statue) పూలమాల వేసిన అనంతరం ఇల్లందు రోడ్ లో ఉన్న రఘునాథపాలెం తహశీల్దార్ కార్యాలయం వరకూ యాత్ర సాగుతుందని పేర్కొన్నారు. అక్కడి నుంచి ర్యాలీగా ఎస్ఆర్ గార్డెన్ కు చేరుకుని మధ్యాహ్నం 12 గంటల తర్వాత పార్కింగ్ స్థలంలో విజయోత్సవ సభ కొనసాగుతుందని తెలిపారు. ఈ సభకు ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు, యూనియన్ రాష్ట్ర , జిల్లా నాయకత్వం హాజరయ్యే సభకు యూనియన్ లకు అతీతంగా జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు.






