5 September, 2026 | 10:47 AM

గల్ఫ్ కార్మికుడి కుటుంబనికి అండగా సాట సభ్యులు

05-09-2026 | 09:25am

రుద్రంగి సెప్టెంబర్ 05విజయక్రాంతి): బతుకుదెరువు కోసం, కుటుంబాన్ని పోషించాలనే ఆశతో సుమారు తొమ్మిది సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాకు(Saudi Arabia) వచ్చిన గడ్డం మోహన్  అనేక కష్టాలను ఎదుర్కొని, చివరకు విగతజీవిగా స్వగ్రామానికి తిరిగి వెళ్లడం పలువురిని కన్నీటి పర్యంతం చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District), రుద్రంగి గ్రామానికి చెందిన గడ్డం మోహన్ ఎప్పటిలాగే రోజువారీ పనికి వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనతోటి కార్మికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం బ్రెయిన్ సర్జరీ(Brain surgery) అవసరమని నిర్ధారించి శస్త్రచికిత్స చేశారు.అయితే, మోహన్ కుటుంబం తీవ్ర పేదరికంలో ఉండటంతో, ఈ క్లిష్ట పరిస్థితుల్లో సహాయం కోసం సాట రియాద్ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ ను సంప్రదించారు.

అప్పటి నుంచి శ్రీనివాస్ మచ్చ తన టీమ్ సభ్యులు ఖాజా ముజమ్మిల్ ఉద్దీన్, సింగు నరేష్ కుమార్, ముదిగొండ శంకర్, నూరుద్దీన్, లోకేష్ తదితర సాట సభ్యులతో కలిసి మోహన్ కుటుంబానికి అండగా నిలిచారు. వైద్య చికిత్సకు సంబంధించిన విషయాల్లోనూ, కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాల్లోనూ తమ వంతు తోడ్పాటును అందిస్తూ వచ్చారు. అయితే అనుకోని పరిస్థితుల్లో గడ్డం మోహన్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో, 23 ఆగస్టు 2026న ఆయన మృతి చెందారు. మోహన్  కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకున్న శ్రీనివాస్ మచ్చ, ఆయన టీమ్ సభ్యులు ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి అండగా నిలిచి, అవసరమైన అన్ని ప్రక్రియలను సమన్వయం చేసి, గడ్డం మోహన్ భౌతికకాయాన్ని ఈరోజు ఆయన స్వగ్రామానికి పంపించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మచ్చ మాట్లాడుతూ... ఈ మొత్తం ప్రక్రియలో ఎంతో సహకారం, సమన్వయం, సహాయ సహకారాలు అందించిన భారత రాయబార కార్యాలయం డెత్ డిపార్ట్ మెంట్ తో పాటు, కార్యాలయంలోని ప్రతి ఒక్క అధికారి, సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం అందించిన సహాయ సహకారాలు బతుకుదెరువు కోసం సౌదీ అరేబియాకు వచ్చిన నిరుపేద భారతీయులకు ఎంతో భరోసాను కల్పిస్తున్నాయని పలువురు అభినందించారు. శ్రీనివాస్ మచ్చ తెలంగాణ ప్రభుత్వంతో కూడా సమన్వయం చేసుకుని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్ నుంచి గడ్డం మోహన్ స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. సౌదీ అరేబియాలో ఏ ఒక్క తెలుగు వ్యక్తి అయినా, ఏ భారతీయుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యంగా సాటను సంప్రదించవచ్చు. అవసరమైన సమయంలో వారికి అండగా నిలవడానికి సాట ఎల్లప్పుడూ ముందుంటుంది అని శ్రీనివాస్ మచ్చ తెలిపారు.

మరిన్ని వార్తలు