నెగెటివ్ కామెంట్లకు కుంగిపోవద్దు
ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్.
సత్తుపల్లి. అక్టోబర్ 22. ( విజయ క్రాంతి ): సోషల్ మీడియాలో(Social Media) వచ్చే నెగెటివ్ కామెంట్లకు కుంగిపోకుండా, లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ సూచించారు. గురువారం సత్తుపల్లి ద్వారకాపురి కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.
విజయం సాధించేందుకు అవకాశాలు కల్పించిన వారిని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని, లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో సోషల్ మీడియాలో వచ్చే ప్రతికూల వ్యాఖ్యలకు నిరుత్సాహపడకూడదని సూచించారు. ప్రజలకు ఉపయోగపడే వాస్తవ సమాచారాన్ని అందిస్తూ, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు.
ఇన్ఫ్లుయెన్సర్లకు అభినందనలు.. సత్కారం
ఈ సందర్భంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మట్టా రాగమయి వారందరినీ అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్పర్సన్ రిహాన కమల్ పాషా, సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నారావు తదితరులు పాల్గొన్నారు.