పల్లెల్లో డీజే సౌండ్లు..ఆంక్షలు గాలికి..!
అనుమతి లేదన్నారు..? అయినప్పటికి విచ్చలవిడిగా వినియోగం
డీజేలతో ప్రమాదం తెలిసినా.. పట్టించుకునేవారు లేరా?
కూసుమంచి, సెప్టెంబర్ 14(విజయక్రాంతి): వినాయక ఉత్సవాల్లో డీజే(DJ)లకు అనుమతి లేదని పోలీసులు, అధికారులు గత వారం రోజులుగా చెబుతున్నారు. విస్తృతంగా ప్రచారం చేశారు. పోలీస్ కమీషనర్ నుంచి ఎస్ఐ లో వరకు సోషల్ మీడియా ప్రచారం చేశారు. మీడియాల్లో భారీ కథనాలు వచ్చాయి.. కానీ పాలేరు నియోజకవర్గంలో విచ్చలవిడిగా డీజే సౌండ్లు వినిపిస్తున్నాయి. వినాయక చవితి తొలిరోజే డీజేలతో హంగామా కనిపించింది. చాలా మంది భక్తులు, ఉత్సవ కమిటీ బాధ్యులు డీజేలు పెట్టి ఊరేగింపు నిర్వహించారు.
తమ ప్రతిష్ఠ కోసం విగ్రహాలను తీసుకెళ్లే సమయంలో భక్తులు డీజేలతో పెద్దఎత్తున ఆర్భాటం చేశారు. అత్యుత్సాహం ప్రదర్శించారు. డీజేల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిసినా, వాటిని వినియోగించడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీజేలతో వచ్చే అధిక శబ్దం వల్ల వాహనదారుల దృష్టి మరలడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయినప్పటికీ కొంతమంది భక్తులు భక్తి కోసమో, బలం చూపించుకునేందుకో తెలియదు కానీ విచ్చలవిడిగా డీజే లు పెట్టి ఊరిగేంపు నిర్వహించారు.
అనుమతులు లేవన్నారు..? ఇదేంటీ..?
డీజేలకు అనుమతి లేదని, డీజేలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించినప్పటికీ వినాయక చవితి రోజున భక్తులు డీజేలను ఉపయోగించారు. ప్రధాన రహదారులపై మోటార్ సైకిళ్ళ తో పెద్ద పెద్ద కేకలు వేస్తూ డీజే పాటలతో సందడి చేశారు. ముఖ్యంగా మండల కేంద్రాల్లో, ప్రధాన గ్రామాల్లో భక్తులు డీజేలను ఉపయోగించారు. తొలిరోజే నిబంధనలు ఉల్లంఘించడంపై విమర్శలు వస్తున్నాయి. పోలీసులు చెప్పే మాటలు కేవలం ప్రచారానికే పరిమితమా? నిబంధనలు నిజంగా అమలు చేస్తారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
పోలీసులు పర్యవేక్షణ ఎటు పోయింది..? గ్రామాల్లో పోలీసు కానిస్టేబుళ్ళు నియమించినప్పటికి వారి పర్యవేక్షణ ఏమైందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మండల కేంద్రాల్లో డీజేలతో ప్రదర్శన నిర్వహిస్తుంటే పోలీసులు, అధికారులు ఎందుకు పట్టించుకోలేదు..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలాగే డీజేలను వదిలేస్తే నిమజ్జనం రోజు కూడా విచ్చలవిడిగా ఉపయోగించే అవకాశం ఉంది. అందుకే పోలీసులు ఇప్పటికైనా స్పందించి డీజే నిర్వాహకులతో మీటింగ్ ఏర్పాటు చేసి ఆంక్షలు విధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరీ పోలీస్ మిత్రులు చర్యలు తీసుకుంటారా..? వేచి చూడాల్సిందే..?