వ్యవసాయాధికారులెక్కడ..?

14-09-2026 | 05:15am

అద్వాన్నం.. వ్యవసాయ అధికారుల పనితీరు..

ఇబ్బందుల్లో రైతులు..

క్షేత్రస్థాయిలో సందర్శనలు కరువు..

తాడ్వాయి, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): రైతుల(Formers)కు మెరుగైన సేవలు అందించాలి, రైతులకు అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం చేయించాలి, రైతుల పంటల దిగుబడులు పెంచాలి అందుకు తగ్గట్టుగా రైతులకు చేరువుగా ఉండి అధికారులు(Agricultural Officials) ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు అందించాలనే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం ప్రతి మండలంలో 6 నుంచి 8 రైతు వేదిక భవనాలను నిర్మించింది.

ఒక్కో రైతు వేదిక లో ఒక్కో ఏఈఓ ఉండేటట్లు చర్యలు తీసుకుంది. గతంలో వ్యవసాయ శాఖ అధికారులకు సరైన వసతి సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారనే సంకల్పంతో ప్రభుత్వం రైతులకు ఎల్లవేళలా అధికారులు అందుబాటులో ఉండాలని భావించి రైతు వేదిక భవనాలు నిర్మించింది.కానీ ప్రభుత్వం ఎన్ని చేసినా సదరు అధికారులలో మాత్రం మార్పు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి.లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన రైతు వేదిక భవనాలకు తాళాలు వేసి దర్శనమిస్తున్నాయి.

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో మొత్తం 6 రైతు వేదిక భవనాలను ప్రభుత్వం నిర్మించింది. కృష్ణాజివాడి, తాడువాయి, చిట్యాల, ఎర్రపహాడ్, కన్కల్, బ్రాహ్మణపల్లి గ్రామాలలో ఈ భవనాలు ఉన్నాయి. సదరు వ్యవసాయ శాఖ అధికారులు రైతు వేదికలలో ఉండి రైతులకు పలు సూచనలు సలహాలు అందించాలి.కానీ సదరు అధికారులు ఎప్పుడు రైతు వేదికలకు వస్తున్నారో, ఎప్పుడు వెళ్తున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క తాడువాయి మండలంలోనే కాకుండా జిల్లాలో నిర్మించిన రైతు వేదిక భవనాలకు అధికారులు చుట్టం చూపులా వస్తూ వెళ్ళిపోతున్నారని రైతులు విమర్శిస్తున్నారు.

ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్..

ప్రభుత్వం ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ను ఏర్పాటు చేసి ఒక్కో క్లస్టర్ కు ఒక్కో వ్యవసాయ విస్తీర్ణాధికారిని నియమించింది. గతంలో మండలంలో ఒకరు ఇద్దరు మాత్రమే వ్యవసాయ విస్తీర్ణాధికారులు ఒక వ్యవసాయ అధికారి ఉండేవారు.దీంతో రైతులకు సూచనలు, సలహాలు అందడం కష్టంగా ఉండేది. అందుకోసం ప్రభుత్వం 4 వేల ఎకరాల నుంచి 5 వేల ఎకరాలకు ఓ క్లస్టర్ ను ఏర్పాటు చేసి వ్యవసాయదారులకు ఇబ్బందులు తొలగించాలని ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించింది.

క్షేత్రస్థాయిలో సందర్శనలు కరువు.. 

సదరు వ్యవసాయ విస్తీర్ణాధికారులు తమ క్లస్టర్ పరిధిలోని రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు అందించాలి. రైతుల పొలాల్లో చీడపీడలు వచ్చినట్లయితే సంబంధిత రైతు పొలానికి వెళ్లి చీడపీడలను గుర్తించి రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాలి. కానీ వ్యవసాయ విస్తీర్ణాధికారులు అలాంటి సందర్శనలే చేయడం లేదని  రైతులు వాపోతున్నారు.ప్రభుత్వం ఇంతమంది అధికారులను నియమించిన రైతులకు ప్రయోజనం లేకుండా పోతుందని వారు చెబుతున్నారు. తాడ్వాయి మండలంలో ఒక ఏవో తో పాటు ఆరుగురు వ్యవసాయ విస్తీర్ణాధికారులు ఉన్నారు. అన్ని క్లస్టర్ లలో అధికారులు ఉన్న రైతులకు ఇబ్బందులు తప్పడం లేదనే విమర్శలు ఉన్నాయి.

యూరియాతో ఇబ్బందులు..

సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోకపోవడంతో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల యూరియా దొరక్కపోవడంతో తాడ్వాయి లోని ఎల్లారెడ్డి, కామారెడ్డి రోడ్డు పై బైఠాయించి రైతులు ధర్నా నిర్వహించారు. యూరియా సరఫరా లో అధికారులు విఫలమవుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అన్ని మండలాల్లో యూరియా సజావుగా సరఫరా అయిన ఒక్క తాడ్వాయి మండలంలోనే ఎందుకు సరఫరా కావడం లేదని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వ్యవసాయ అధికారులు సక్రమంగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను రైతులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు