రాజ్యాంగ విలువలే ప్రజాస్వామ్యానికి పునాది

26-11-2026 | 08:50pm

ఖమ్మం, నవంబర్ 26 విజయక్రాంతి: భారత రాజ్యాంగ దినోత్సవం(Constitution Day of India) సందర్భంగా దేశ ప్రజలకు బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు(Former MP Nama Nageswara Rao) శుభాకాంక్షలు తెలిపారు. సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సామరస్యానికి భారత రాజ్యాంగం మార్గదర్శకమని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నేతృత్వంలో రూపొందిన రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని పేర్కొన్నారు. రాజ్యాంగ రూపకర్తలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సాధ్యమైందని గుర్తు చేశారు. రాజ్యాంగం కల్పించిన అవకాశంతో రెండుసార్లు ఖమ్మం ఎంపీగా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని, పార్లమెంట్ లైబ్రరీ కమిటీ చైర్మన్‌గా, పలు కమిటీల్లో సభ్యుడిగా పనిచేశానని తెలిపారు. 15వ లోక్‌సభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా, తెలంగాణ బిడ్డగా రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై తొలి ఓటు వేసే అవకాశం దక్కిందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టడంతో పాటు 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషమన్నారు. 17వ లోక్‌సభలో బీఆర్ఎస్ పక్ష నేతగా నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నామ గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు