ఖమ్మం చిన్నారి లీతికకు ఇండియన్ గ్లోరీ-2026 అవార్డు

01-11-2026 | 05:59pm

సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా ఘన సన్మానం

ఖమ్మం, నవంబర్ 1 (విజయక్రాంతి): జిమ్నాస్టిక్స్‌లో అసాధారణ ప్రతిభతో తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తున్న ఖమ్మం నగరానికి చెందిన శివ శృతి కుమార్తె చిన్నారి అనంతోజు లీతిక ప్రతిష్టాత్మక ఇండియన్ గ్లోరీ-2026 అవార్డు(Indian Glory Award)ను సొంతం చేసుకుంది.

జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రసాద్ ల్యాబ్స్ ఆడిటోరియంలో మేడిది వెంకటేశ్వర రావు, కళారత్నం మూవీస్ మరియు మేడిది సుబ్బయ్య ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు సుమన్, మిమిక్రీ కళాకారులు, సినీ డైరెక్టర్ మల్లం రమేష్ చేతుల మీదుగా లీతికకు ఈ అవార్డును అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించి మెమొంటోను బహుకరించారు.

చిన్నతనంలోనే జిమ్నాస్టిక్స్‌లో అద్భుతమైన నైపుణ్యం కనబరిచి జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయాలు సాధించి స్పోర్ట్స్ స్కూల్‌లో ఉచిత సీటు పొందిన లీతిక ప్రతిభను సభలోని అతిథులు కొనియాడారు. లీతికను తీర్చిదిద్దడంలో నిరంతరం ప్రోత్సహిస్తున్న కోచ్ ఇందిర, విక్రమ్, కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ హెచ్‌ఎం శ్రీనివాసరావుల మార్గదర్శకత్వాన్ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. చిన్న వయసులోనే జాతీయ స్థాయి అవార్డు సాధించి ఖమ్మం కీర్తిని పెంచిన లీతికకు ఆమె తాతయ్య, అమ్మమ్మ, కుటుంబ సభ్యులు, గురువులు, క్రీడాభిమానులు మరియు ఖమ్మం నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు