పోలీస్ అమరవీరుల కోసం సర్వమత ప్రార్థనలు
సవరన్ మసీదులో సీపీ గౌష్ ఆలం ప్రత్యేక ప్రార్థనలు
కరీంనగర్ క్రైం, అక్టోబర్ 23(విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా స్థానిక సవరన్ మసీదులో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం(Karimnagar Police Commissioner Gous Alam) శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సర్వమత ప్రార్థనలలో భాగంగా సమాజ రక్షణ కోసం, శాంతిభద్రతల పరిరక్షణలో విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని ప్రార్థించారు.
అలాగే పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది క్షేమం, ప్రజా సంక్షేమం కోరుతూ ప్రత్యేక దువా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ సమాజ శాంతి కోసం అమరులైన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీతో పాటు ఏసీపీలు యాదగిరిస్వామి, వెంకటస్వామి, విజయకుమార్, టౌన్ మరియు ట్రాఫిక్ సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.