అనురాగ్ లో ఎన్ఎస్ఎస్ ప్రీ రిపబ్లిక్ డే ఎంపికలు
ఘట్ కేసర్, అక్టోబర్ 23 (విజయక్రాంతి) : అనురాగ్ యూనివర్సిటీలో(Anurag University) జాతీయ సేవా పథకం(National Service Scheme) (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో ప్రీ రిపబ్లిక్ డే ఎంపికలు నిర్వహించారు. విశ్వవిద్యాలయంలోని వివిధ ఎన్ఎస్ఎస్ యూనిట్లకు(NSS units) చెందిన వాలంటీర్లు ఈఎంపికల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిభావంతులైన, క్రమశిక్షణ కలిగిన, సేవాభావం ఉన్న యువతను గుర్తించి, గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు సంబంధించిన తదుపరి ఎంపికలకు సిద్ధం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం అని తెలిపారు.
ఈకార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఎన్ఎస్ఎస్ ప్రాంతీయ సంచాలకులు సైదా రామావత్, సహాయ ప్రాంతీయ సంచాలకులు ఎన్. సంజయ్ కుమార్, తెలంగాణ మై భారత్ సంచాలకులు సి.హెచ్. అన్వేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనురాగ్ యూనివర్సిటీలోని(Anurag University) వివిధ ఎన్ఎస్ఎస్ యూనిట్ల నుంచి పాల్గొన్న వాలంటీర్లలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, శారీరక దృఢత్వం, సేవాభావం, దేశభక్తి వంటి అంశాలను పరిశీలిస్తూ ఎంపికల ప్రక్రియ నిర్వహించారు.
ఈకార్యక్రమంలో విశ్వవిద్యాలయ యాజమాన్యం తరపున స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్ డాక్టర్ వి. విజయ్ కుమార్, ఎన్ఎస్ఎస్ సెల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ సి. మల్లేశ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు టి. పురుషోత్తం, పి. చిన్న శ్రీనివాసరావు, ఎన్ఎస్ఎస్ శిక్షకులు, ఎన్సీసీ అధికారులు పాల్గొన్నారు.