చదువులో వెనుకబడిన విద్యార్థులకు వీకెండ్ తరగతులు
ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ డివిజన్(Ghatkesar Division) పరిధిలోని కొండాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల(Kondapur Government Primary School)లో విద్యాపరంగా వెనుకబడిన విద్యార్థుల అభ్యసన నైపుణ్యాలను పెంపొందించేందుకు స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శనివారం వీకెండ్ తరగతులు నిర్వహించారు.
సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థుల సహకారంతో నిర్వహించిన ఈ తరగతుల్లో ప్రాథమిక విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్ చదవడం, రాయడం, గణితంలో ప్రాథమిక అంశాలపై ప్రత్యేక శిక్షణ అందించారు. విద్యార్థుల వ్యక్తిగత అభ్యసన స్థాయిని గుర్తించి, వారికి అర్థమయ్యే రీతిలో బోధన చేపట్టారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడంతో పాటు, విద్యాపరంగా వెనుకబడిన పిల్లల్లో ఆత్మవిశ్వాసం, నేర్చుకోవాలనే ఆసక్తిని పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ళ యాదయ్య తెలిపారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్. దాసు, ఉపాధ్యాయులు శివకుమార్, లక్ష్మీ కల్పన, ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.