మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
నల్ల బ్యాడ్జీలు ధరించి శంకరపట్నం మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల నిరసన
హుజూరాబాద్,(విజయక్రాంతి): మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, MS JAC పిలుపు మేరకు శంకరపట్నం తెలంగాణ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు(Model School Teachers) శనివారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయాలని, 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, హెల్త్ కార్డులు, కారుణ్య నియామకాలు కల్పించాలని, 317 జీవో అమలు చేయాలని కోరారు. టీజీటీలకు నేషనల్ ఇంక్రిమెంట్లు వర్తింపజేయడంతో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కె. ప్రభాకర్, TG TEAM రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. మహేందర్ కట్కూరి, ఉపాధ్యాయులు, ఔట్సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.