ప్రజా సమస్యలపై దృష్టి పెట్టని కాంగ్రెస్ ప్రభుత్వం

31-10-2026 | 05:59pm

ఢిల్లీ పర్యటనలు, రాజకీయ విమర్శలకే సీఎం ప్రాధాన్యం

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి

భూపాలపల్లి,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి(Ex-MLA Gandra Venkata Ramana Reddy) విమర్శించారు. పాలనపై దృష్టి పెట్టకుండా డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. శనివారం భూపాలపల్లి జిల్లా బీఆర్‌ఎస్ కార్యాలయంలో మున్సిపాలిటీలోని 16, 28 వార్డులు, రాంనగర్, సుభాష్ కాలనీలకు చెందిన సుమారు 100 మంది యువకులు గండ్ర వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.

వారికి పార్టీ కండువాలు కప్పి ఆయన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ కరువు పరిస్థితుల్లో రైతులకు ప్రభుత్వం తగిన సహాయం అందించడం లేదని, సింగరేణి కార్మికులు, నిరుద్యోగులు, మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాజకీయ కక్షతో వ్యవహరించడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ విధానం కొనసాగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు.

రానున్న వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. నవంబర్ 6 చివరి తేదీ కావడంతో వెంటనే నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి, ఒడిసిఎంఎస్ మాజీ చైర్మన్ రామస్వామి నాయక్, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం నవంబర్ 22న హన్మకొండ కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించనున్న స్వేరో సంస్థ ఆత్మీయ సమ్మేళనం పోస్టర్‌ను ఆవిష్కరించారు.

మరిన్ని వార్తలు