అంగన్ వాడీలను అద్బుతంగా తీర్చిదిద్దుతున్నాం
కొత్తపల్లి,(విజయక్రాంతి): అంగన్వాడీ కేవలం పిల్లలకు భోజనం పెట్టే కేంద్రాలకే పరిమితం చేయకుండా పోషణతో పాటు ఆరోగ్యం, ప్రీ-స్కూల్ విద్య, డిజిటల్ మానిటరింగ్ అద్బుత సౌకర్యాలను కేంద్రంలోని నరేంద్రమోదీ(Narendra Modi) ప్రభుత్వం అందిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) తెలిపారు. అందులో భాగంగా 2 లక్షల అంగన్వాడీలను(Anganwadi ) సాక్షమ్ అంగన్వాడీలుగా ఆధునికీకరించే కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. గుజరాత్ సీఎంగా మొదలు ప్రధాని వరకు నరేంద్ర మోదీ పాతికేళ్ల ప్రజా పాలనా సుధీర్ఘ ప్రయాణాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప్ అభియాన్ – జన్ సేవా హీ ప్రభు సేవా(Seva Sankalp Abhiyan - Jan Seva Hi Prabhu Seva) పేరిట దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే.
అందులో భాగంగా గురువారం రోజున కరీంనగర్ లోని తీగలగుట్టపల్లిలో బీజేపీ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో అంగన్ మిలన్ సేవా పేరుతో నిర్వహించిన కార్యక్రమనికి కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ తోపాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మహిళా మోర్చా జిల్లా నాయకురాలు నిర్మలారెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగన్ వాడీ కేంద్రంలో పిల్లలకు అందిస్తున్న పోషకాహారం పదార్థాలను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్ ను సందర్శించి ,అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు, కార్యకర్తలు పిల్లలకు అందిస్తున్న సేవలను కొనియాడుతూ వారిని ఘనంగా సన్మానించారు.
అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ... అంగన్వాడీ వ్యవస్థను కేవలం పిల్లలకు ఆహారం ఇచ్చే కేంద్రంగానే కాకుండా పోషణ ,ఆరోగ్యం, ప్రీ-స్కూల్ విద్య డిజిటల్ మానిటరింగ్ కలిసిన అద్బుత వ్యవస్థగా మార్చే దిశగా ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. అందులో భాగంగా గత 12 ఏళ్లలో అంగన్వాడీలు, చిన్నారుల పోషణ, గర్భిణీలు–బాలింతల పోషకాహారం కోసం దాదాపు 1 లక్షా 77 వేల కోట్లకు పైగా నిధులను ఖర్చు చేసింది. ప్రస్తుతం 2 లక్షల అంగన్వాడీ కేంద్రాలను దశలవారీగా సాక్ష్యం అంగన్ వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేసి వైఫై, ఎల్ఈడీ స్ర్కీన్లు, ఆర్వో ప్లాంట్లు, స్మార్ట్ లెర్నింగ్ వంటి సదుపాయాలను కల్పించే ప్రక్రియ కొనసాగుతోందని ,
2021లో ప్రారంభమైన పోషణ్ ట్రాకర్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలు, కార్యకర్తలు, పిల్లల ఎదుగుదల, హాట్ కుక్డ్ మీల్స్ వంటి సేవలను డిజిటల్‌గా ట్రాక్ చేస్తున్నారు. 2025 నాటికి 14 లక్షల అంగన్వాడీ కేంద్రాలు, 9 కోట్లకు పైగా లబ్ధిదారులు పోషణ్ ట్రాకర్ లో నమోదయ్యారు. సుమారు 8 కోట్ల మంది పిల్లల ఎదుగుదలను నెలవారీగా పోషణ్ ట్రాకర్ ద్వారా పర్యవేక్షిస్తున్నాం.
గత ఐదేళ్లలో (2021–26) ఉపాధి హామీ పథకం(జీ రామ్ జీ) ద్వారా 50 వేల అంగన్వాడీ భవనాల నిర్మాణం కొనసాగుతోంది. ఒక్కో కేంద్రానికి ఎంజిఎన్ఆర్ఈజీఎస్ నుంచి 8 లక్షలు, 15వ ఆర్థిక సంఘం/ఇతర నిధుల నుంచి 2 లక్షలు, మహిళా–శిశు అభివృద్ధి శాఖ నుంచి 2 లక్షలు కలిపి మొత్తం 12 లక్షల రూపాయల వరకు ఈ అంగన్ వాడీ భవనాల నిర్మాణం కోసం కేంద్రం ఖర్చు చేస్తోందని,2 లక్షల అంగన్వాడీలను ‘సాక్షమ్ అంగన్వాడీ’లుగా ఆధునికీకరించే కార్యక్రమం చేపట్టింది.గతేడాది( 2025-26)లోనే సాక్ష్యం అంగన్ వాడీ, పోషణ్ 2.0 అమలు కోసం రూ. 21 వేల 960 కోట్ల బడ్జెట్ ను కేటాయించిందని తెలిపారు.
అదే విధంగా తీగలగుట్టపల్లి 2వ డివిజన్ లోని చంద్రపురి కాలనీ ప్రాంతంలో రూ. 65.30 లక్షల యూఐడీఎఫ్ నిధుల అంచనా వ్యయంతో చేపట్టనున్న డ్రైన్ పైప్ లైన్ అండ్ సి.సి. రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ఎంపీపీఎస్, జిల్లా పరిషత్ పాఠశాలలో రూ.1.05 కోట్ల నిధుల అంచనా వ్యయంతో చేపట్టిన మౌలిక వసతుల కల్పన నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.