కూరగాయల మార్కెట్‌కు నూతన కమిటీ
- వ్యాపారుల ఏకగ్రీవ సమ్మతి.. అధ్యక్షుడిగా ఎస్‌కే గౌస్
ఇల్లెందు,(విజయక్రాంతి): ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూరగాయల మార్కెట్(Netaji Subhash Chandra Bose Vegetable Market)కు నూతన కమిటీని వ్యాపారులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం మున్సిపల్ చైర్‌పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర డానియల్(Municipal Chairperson Dodda Kiran Mitra Daniel) ఆధ్వర్యంలో జరిగిన వ్యాపారుల సమావేశంలో నూతన కమిటీని ఎంపిక చేశారు. అధ్యక్షుడిగా ఎస్‌కే గౌస్, ప్రధాన కార్యదర్శిగా నారాయణ లోదు, ఉపాధ్యక్షుడిగా పెండ్యాల హరికృష్ణ ఎన్నికయ్యారు.
మార్కెట్ అభివృద్ధి, వ్యాపారుల సమస్యల పరిష్కారం, మెరుగైన సౌకర్యాల కల్పనకు సమన్వయంతో కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు. పాత మార్కెట్ శిథిలావస్థకు చేరడంతో నూతన మార్కెట్ నిర్మాణానికి ఎమ్మెల్యే, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ కోరం కనకయ్య నిధులు మంజూరు చేయించడంలో కీలకంగా కృషి చేశారని వ్యాపారులు పేర్కొన్నారు. గదుల కేటాయింపులో ఏర్పడిన సమస్యలను కూడా ఆయన సహకారంతో పరిష్కరించుకున్నట్లు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పెండ్యాల రాజు, కమిషనర్ ఎస్.సందీప్, కౌన్సిలర్ ఎండీ జాఫర్, కాంగ్రెస్ నాయకుడు మేకల శ్యామ్ మాదిగ, మున్సిపల్ అధికారులు, మార్కెట్ వ్యాపారులు పాల్గొన్నారు.