పండుగ సాయన్న జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం

22-10-2026 | 03:35pm

ఘనంగా సాయన్న జయంతి వేడుకలు 

భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 22 ( విజయక్రాంతి ) : పండుగ సాయన్న జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్(District SP Sirisetti Sankeerth) అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పండుగ సాయన్న జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించగా సాయన్న చిత్రపటానికి ఎస్పీ పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల జానపద చరిత్రలో పేదల పక్షాన నిలిచి, అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రజావీరుడిగా పండుగ సాయన్న ప్రత్యేక గుర్తింపు పొందారని గుర్తుచేశారు. పేదలకు అండగా నిలవడం, బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడటం ఆయన జీవితంలో ప్రధానమైన విలువలని తెలిపారు.

ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరిస్తూ, బలహీన వర్గాలకు అండగా నిలవడం ద్వారా ఆయన ఆశయాలను భావితరాలకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నరేష్ కుమార్, ఆర్‌ఐలు కాశీరాం, పూర్ణచందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు