భూపాలపల్లి పట్టణ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి,(విజయ క్రాంతి): భూపాలపల్లి పట్టణ సమగ్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు(MLA Gandra Satyanarayana Rao) అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కార్యాలయం(IDOC Office)లో పట్టణ అభివృద్ధి పనులపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రహదారుల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి, ట్రాఫిక్ సిగ్నళ్ల పునర్వ్యవస్థీకరణ, తాగునీటి పైప్‌లైన్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల తరలింపు పనులను త్వరితగతిన చేపట్టాలని సూచించారు.
అంబేద్కర్ జంక్షన్ నుంచి కృష్ణా కాలనీ, ఓసీ-2 వరకు రహదారి విస్తరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విస్తరణ పనులకు అడ్డుగా ఉన్న విద్యుత్, నీటి పైప్‌లైన్లను గుర్తించి వాటి తరలింపునకు అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. పట్టణంలోని అంబేద్కర్ జంక్షన్, కృష్ణకాలనీ రాజీవ్ సర్కిల్, ఓసీ-2, హనుమాన్ జంక్షన్, బస్టాండ్, మంజూర్‌నగర్ కూడళ్ల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని తెలిపారు.
కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma) మాట్లాడుతూ... మంజూరైన పనులకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి వెంటనే ప్రారంభించాలని, శాఖల మధ్య సమన్వయ లోపంతో జాప్యం జరగకూడదని అన్నారు. ప్రత్యేక నిధులను సమర్థంగా వినియోగించి పట్టణ రూపురేఖలు మారేలా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అటవీ అధికారి కిష్టా గౌడ్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కమిషనర్ ఉదయ్‌కుమార్, సింగరేణి జీఎం రాజేశ్వరరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.