యాసంగిలో వరి వద్దు.. ఆరుతడి పంటలే ముద్దు

29-10-2026 | 05:04pm

తరిగొప్పుల, అక్టోబర్ 29 (విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి భూగర్భ జలాలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున యాసంగి (Rabi Season)లో అధిక నీటి అవసరం ఉండే వరి, మొక్కజొన్నకు బదులుగా ఆరుతడి పంటలు (Dryland Crops) సాగు చేయాలని ఏఈఓ వినయ్ కుమార్ రైతులకు సూచించారు. తరిగొప్పుల మండలం బొత్తలపర్రె గ్రామపంచాయతీ వద్ద గురువారం నిర్వహించిన ‘ఖేతీ బచావో అభియాన్’ (Kheti Bachao Abhiyan) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

యాసంగిలో కుసుమలు, పొద్దుతిరుగుడు, నువ్వులు, వేరుశనగ, బొబ్బర్లు, కూరగాయలు వంటి పంటలను సాగు చేయడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. రైతులకు అవసరమైన విత్తనాల వివరాలను నమోదు చేసుకొని, మండల కేంద్రంలో అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ భూక్యా రవి మాట్లాడుతూ రైతులంతా వ్యవసాయ శాఖ సూచనలు పాటించి, నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ (Subsidy) సదుపాయాన్ని వినియోగించుకొని డ్రిప్, స్ప్రింక్లర్‌ (Drip & Sprinkler Irrigation) పద్ధతుల ద్వారా నీటిని పొదుపు చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రవి, పంచాయతీ కార్యదర్శి రవీందర్, ఫీల్డ్ అసిస్టెంట్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు