శ్రీనివాసుల మహా సంకల్ప పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ

24-11-2026 | 08:22pm

75 వాట్సాప్ గ్రూపులు.. 50 వేల మంది శ్రీనివాసులు

ప్రపంచంలోనే ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సంకల్పం.. గురూజీ ప్రశంసలు

కొడిమ్యాల, నవంబర్ 24 (విజయక్రాంతి): కరీంనగర్ నుండి తిరుమల తిరుపతి వరకు తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ(Telangana Srinivasula Seva organization) ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీనివాసుల మహా సంకల్ప పాదయాత్ర పోస్టర్‌ను మంగళవారం కొండగట్టు గిరి ప్రదక్షిణ సందర్భంగా పూజ్య గురువులు సురేష్ ఆత్మారాం గురూజీ చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. ఈ పాదయాత్ర 12వ తేదీ డిసెంబర్ 2026 శనివారం ఉదయం 9:30 గంటలకు కరీంనగర్ పట్టణంలోని మార్కెట్ రోడ్డులో ఉన్న  ఇంటగేశ్వర స్వామి దేవాలయం నుండి ప్రారంభం కానుంది. 

ఈ సందర్భంగా పూజ్య గురువులు సురేష్ ఆత్మారాం గురూజీ  మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన రీతిలో శ్రీనివాస్ అనే పేరుతో ఏర్పాటైన తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థలో 75 వాట్సాప్ గ్రూపుల ద్వారా సుమారు 50 వేల మంది శ్రీనివాసులు ఒకే వేదికపైకి వచ్చి సామాజిక సేవ, సనాతన ధర్మ పరిరక్షణ, రక్తదానం వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తమ సేవా కార్యక్రమాలతో మంచి గుర్తింపు పొందడమే కాకుండా ప్రపంచ రికార్డును కూడా సొంతం చేసుకోవడం గొప్ప విషయమన్నారు.

శ్రీనివాస్ అనే పేరు కలిగిన వారందరూ కలిసికట్టుగా కరీంనగర్ నుండి తిరుమల తిరుపతి వరకు పాదయాత్ర చేపట్టి కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామివారి సన్నిధికి చేరుకోవాలనే సంకల్పం ఎంతో గొప్పదని అన్నారు. తనను గురువుగా స్వీకరించి తన మార్గదర్శకత్వంలో ఈ మహా సంకల్ప యాత్ర చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. కొండగట్టు ఆంజనేయ స్వామివారి ఆశీస్సులతో ఈ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ వూట్కూరి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... ప్రపంచంలోనే ప్రత్యేకమైన రీతిలో శ్రీనివాస్ అనే పేరుతో ఏర్పాటైన మన సంస్థ తరఫున చేపడుతున్న ఈ మహా సంకల్ప పాదయాత్రలో ప్రతి ఒక్క శ్రీనివాసుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యంగా ఉన్న శ్రీనివాసులు ఈ పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ మహత్తర కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తమకు చేతనైన విధంగా ఆర్థిక సహకారం, వస్తు రూపంలో సహకారం అందించి యాత్ర విజయవంతానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఐక్యత, భక్తి, సేవాభావం, సనాతన ధర్మ పరిరక్షణ వంటి ఉన్నత ఆశయాలను సమాజానికి చాటిచెప్పడమే తమ ప్రధాన లక్ష్యమని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సుమారు 80 మంది శ్రీనివాసులు పాల్గొన్నారు. కొండగట్టు గిరి ప్రదక్షిణకు విచ్చేసిన సుమారు 70 వేల మంది భక్తుల సమక్షంలో ఈ పోస్టర్ ఆవిష్కరణ జరగడం విశేషం. ఈ కార్యక్రమం భక్తులను, చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. కరీంనగర్ నుండి తిరుపతికి.. శ్రీనివాసులందరి ఐక్యతతో.. భక్తి, సేవ, ధర్మ సంకల్పంతో సాగనున్న ఈ మహా పాదయాత్రను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

ఇదే వేదికపై కొత్తపల్లి మాజీ సర్పంచ్ బండ గోపాల్ రెడ్డి శ్రీనివాసుల మహా సంకల్ప పాదయాత్రకు 5116 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి వూట్కూరి శ్రీనివాసుల సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్, చెన్నమనేని శ్రీనివాస రావు, బోగ శ్రీనివాస్, ఇజ్జగిరి శ్రీనివాస్, పైడ శ్రీనివాస్, గాండ్ల శ్రీనివాస్, శ్రీరాముల శ్రీనివాస్, తూము శ్రీనివాస రావు, బాజోజి శ్రీనివాస్, సంగ శ్రీనివాస్, నల్ల శ్రీనివాస్, బండ గోపాల్ రెడ్డి, గౌతమ్ విశిష్ట మొదలగువారు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు