పవన్ కళ్యాణ్ పై అభిమానం..
విదేశాల్లో జనసేన జెండా రెపరెపలు...!
బాన్సువాడ, నవంబర్ 24 (విజయక్రాంతి): జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని దేశ విదేశాల్లో చాటుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణానికి చెందిన ప్రవాస భారతీయుడు జంగం సాయి కృష్ణ (పింటూ). తాను పర్యటించే ప్రతి దేశంలోనూ జనసేన పార్టీ(Janasena Party) జెండా, భావజాలాన్ని పరిచయం చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. తాజాగా పోర్చుగల్ రాజధాని లిస్బన్లోని ప్రసిద్ధ లిస్బో ప్రాంగణంలో జనసేన పార్టీ పోస్టర్‌ను ప్రదర్శించి తన అభిమానాన్ని చాటుకున్నారు.
అవినీతి రహిత పాలన, ప్రజా సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానం తనకు ఎంతో స్ఫూర్తినిస్తుందని సాయి కృష్ణ పేర్కొన్నారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ పార్టీ పట్ల తనకున్న అభిమానాన్ని, నిబద్ధతను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఒక సామాన్య కార్యకర్తగా విదేశీ గడ్డపై జనసేన పార్టీ పట్ల తన అభిమానాన్ని చాటుకుంటున్న జంగం సాయి కృష్ణ (పింటూ)ను పలువురు జనసేన అభిమానులు, పార్టీ శ్రేణులు అభినందిస్తున్నారు. బాన్సువాడకు చెందిన వ్యక్తి అంతర్జాతీయ వేదికపై పార్టీ పట్ల అభిమానాన్ని చాటడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.