జీవో 97 రద్దు చేయాల్సిందే!
రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన ఉద్ధృతం.. పోలీసులతో స్వల్ప తోపులాట
ఉప్పల్,(విజయక్రాంతి): జీవో నంబర్ 97ను రద్దు చేయాలని, పాలిటెక్నిక్ కళాశాలలను((Polytechnic College)) శక్తి పరిధిలోకి తీసుకురావద్దని డిమాండ్ చేస్తూ రామంతాపూర్(Ramanthapur) ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు(students) చేపట్టిన నిరవధిక ఆందోళన గురువారం తీవ్రరూపం దాల్చింది. 20 రోజులకుపైగా తరగతులను బహిష్కరించి కళాశాల వద్ద నిరసన కొనసాగిస్తున్న విద్యార్థులు.. తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన తీవ్రతరం కావడంతో కళాశాల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులు కళాశాల నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.
జీవో 97 అమలుతో పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి పరిధిలోకి తీసుకురావడాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల పాలిటెక్నిక్ విద్యా విధానంలో మార్పులు జరిగి తమ విద్యా భవిష్యత్తుపై అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. స్కిల్ యూనివర్సిటీలో ప్రతిపాదించిన పీపీపీ విధానం ద్వారా కళాశాలల భూములను ప్రైవేటు అవసరాలకు వినియోగించే అవకాశం ఉందని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుత సాంకేతిక విద్యా విధానంలోనే పాలిటెక్నిక్ విద్యను కొనసాగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశంపై వెంటనే స్పష్టత ఇవ్వాలని కోరారు. జీవో 97ను రద్దు చేసి, పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి పరిధిలోకి తీసుకురావద్దని అసెంబ్లీ వేదికగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన కొనసాగిస్తామని, స్పందన లేకపోతే నిరసనలను మరింత ఉద్ధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.