14 రాష్ట్రాల చేనేత కళా వైభవం ఒకే వేదికపై
ఇండియన్ సిల్క్ గ్యాలరీ నీ ప్రారంభించిన గుండు సుధారాణి
హనుమకొండ, సెప్టెంబర్ 24(విజయ క్రాంతి):భారతీయ వస్త్ర సంప్రదాయం, కళాత్మకతకు ప్రతీకగా ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో నిలుస్తుందని, 14 రాష్ట్రాల హస్తకళాకారుల చేతిలో రూపుదిద్దుకున్న అత్యద్భుతమైన డిజైన్లకు ఇది సరైన వేదిక అని కుడా చైర్మన్ గుండు సుధారాణి(Chairperson Gundu Sudharani) అన్నారు. హంటర్ రోడ్, హన్మకొండ హంటర్ రోడ్డు లోని అలకానంద కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటుచేసిన ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సతీమణి నీలిమ, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఉషా దయాకర్ రావు తో కలిసి గుండు సుధారాణి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశం ప్రపంచ చేనేత, పట్టు వస్త్ర సంపదకు పుట్టినిల్లుగా నిలిచిందని, దేశంలోని ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన కాటన్, పట్టు వస్త్ర సంప్రదాల విశిష్టత ఉండటం భారతీయ నేత కళాకారుల అపూర్వ నైపుణ్యానికి, మన సంస్కృతి వైభవానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతి చీర వెనుక నేతన్నల శ్రమ, కళాత్మకత, తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం దాగి ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉప్పాడ, ధర్మవరం పట్టు చీరలు, తమిళనాడులోని కాంచీపురం పట్టు, కర్ణాటకలోని మైసూర్ సిల్క్, తెలంగాణలోని గద్వాల్, పోచంపల్లి ఇక్కత్, పశ్చిమ బెంగాల్లోని బాలుచరి, తాంతి సిల్క్, ఒడిశాలోని సంభల్పురి ఇక్కత్, ఉత్తరప్రదేశ్లోని వారణాసి బెనారసీ సిల్క్ వంటి దేశంలోని ప్రసిద్ధ చేనేత, పట్టు వస్త్రాలు భారతీయ నేత కళా వైభవాన్ని ప్రపంచానికి చాటుతున్నాయని అన్నారు. ఈ అరుదైన,నాణ్యమైన వస్త్రాలను ఒకే వేదికపై నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని తెలిపారు.
ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో ఈ నెల 24వ తేదీ నుంచి 28 వ తేదీ వరకు 5 రోజుల పాటు అలరిస్తుందని ఎక్స్పో నిర్వాహకులు శ్రీనివాసరావు తెలిపారు. చందేరి, మహేశ్వరి, కోట, రాజ్కోట్ పటోలా.. ఇలా వివిధ ప్రాంతాల ప్రత్యేక డిజైన్ల చేనేత వస్త్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన ప్రజలకు అందుబాటులో ఉంటుందని, కుటుంబ సమేతంగా వచ్చి భారతీయ చేనేత, పట్టు వస్త్రాల వైవిధ్యాన్ని వీక్షించి నచ్చిన వస్త్రాలను కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో విభాగం టీపీసీసీ చేనేత విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు, పద్మశాలి సంఘం నాయకుడు వైద్యం రాజగోపాల్, ఎర్రబెల్లి కమల తదితరులు పాల్గొన్నారు.