మానవత్వాన్ని మర్చిపోతున్నామా?
రాబోయే రోజుల్లో మనిషికి మనిషితో సంబంధం(Human Relations) లేకుండా, మర మనుషులతో, కృత్రిమ మేధస్సు (AI) తో కలిసి బతికే పరిస్థితి వస్తుందా అంటే అవుననే అనిపిస్తుంది. ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ కాదు. జపాన్‌లో ఒంటరిగా ఉండేవారి కోసం రోబోలు తోడుగా ఉంటున్నాయి. మన ఇంట్లో అలెక్సా, చాట్ జీపీటీతో మాట్లాడుతున్నాం కానీ, పక్కింటి వారితో మాట్లాడడం లేదు. 20 ఏళ్ల క్రితం ఉమ్మడి కుటుంబాలుండేవి.
ఇప్పుడు భార్యాభర్తలు, పిల్లలకు కూడా వేర్వేరు గదులు, వేర్వేరు ప్రపంచాలు.. ఎవరికి ఎవరు అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. ఫేస్‌బుక్‌లో 5వేల మంది ఫ్రెండ్స్ ఉన్నారు.. కానీ, ఆపదలో సహాయానికి వచ్చేవారు ఒక్కరూ లేరు. లైక్‌ల కోసం పాకులాడుతూ, నిజమైన బంధాలను మర్చిపోతు న్నాం. 20 సంవత్సరాల క్రితం కవి అందెశ్రీ రాసిన ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు‘ అనే పాట నేడు అక్షరాలా నిజమనిపిస్తున్నది.
పెద్దలు అప్పుడప్పుడు అంటుంటారు.. మనం చనిపోయిన తర్వాత మోయడానికి కనీసం నలుగురు వస్తే చాలు అని. కానీ నేడు ఆ పనులకు ప్రైవేటు ఏజెన్సీలు వచ్చాయి. డబ్బు కడితే వారే అన్నీ చేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే మానవ సంబంధాలు ఎంతగా పతనమయ్యాయో అర్థమవు తుంది-. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, ఒంటరితనం రోజుకు 15 సిగరెట్లు తాగడంతో సమానమైన హానికరం. భారతదేశంలో 35% యువత తీవ్ర మానసిక ఒత్తిడి, భయం, ఆందోళనతో బాధపడుతున్నది.
ఈ పోటీ ప్రపంచంలో మనిషి ఒక యంత్రంలా మారిపోయాడు. ఉద యం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కేవలం పని, డబ్బు, హోదా మాత్రమే ఆలోచిస్తున్నాడు. అరిస్టాటిల్ చెప్పినట్లు ‘మానవుడు సంఘజీవి‘. మన భారతీయ సంస్కృతి కూడా ‘వసుధైక కుటుంబం.. - ప్రపంచ మంతా ఒకే కుటుంబం‘ అని చెప్పింది. మనం ఎంత ఎదిగినా చివరకు తోడు కావాల్సింది మనిషే, యంత్రం కాదు. అబ్దుల్ కలాం గారు అన్నట్లు - ‘మనం ఒంటరిగా ఎంత వేగంగా వెళ్లగలమో, కలిసి అంత దూరం వెళ్లగలం.‘మదర్ థెరిసా అన్నట్లు - ‘ఈ ప్రపంచంలో ఆకలి అంటే కేవలం అన్నం కాదు, ప్రేమ, ఆప్యాయత’ అని పేర్కొన్నారు.
మనం ఏం చేయాలి
సాంకేతికతకు బానిస కావద్దు, యజమానిగా ఉండండి: ఏఐ మన పనిని సులభం చేయాలి, మన మానవత్వాన్ని చంపకూడదు. భోజనం చేసేటప్పుడు, కుటుంబంతో ఉన్నప్పుడు ఫోన్ పక్కన పెట్టండి.
సంపాదన కాదు, సంబంధం ముఖ్యం: డబ్బు మంచం కొనగలదు కానీ నిద్రను కాదు. ఇల్లు కొనగలదు కానీ కుటుంబాన్ని కాదు. రోజుకు 10 నిమిషాలు బంధువులకు ఫోన్ చేయండి.
మాట్లాడటం ఒక ఔషధం: మాట్లాడటం వల్ల మానసిక ఒత్తిడి, డిప్రెషన్ 60% తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇదే ఉత్తమ మం దు. పక్కవారిని పలకరించడం అలవాటు చేసుకోండి.
సేవల్లో పాల్గొనండి : నెలకు ఒకసారైనా ఏదైనా సేవా కార్యక్రమం లో పాల్గొనండి. అనాధాశ్రమాలను, వృద్ధాశ్రమాలను సందర్శించండి, ఒక పేద విద్యార్థికి సహాయం చేయండి. ఇలాంటి పనులు ఇచ్చే ఆనందం, సంతృప్తి మహా గొప్పది.
పిల్లలకు నేర్పండి: మార్కుల కంటే మంచితనం, సహాయం, కరుణ జాలి దయ, సేవా గుణం గొప్పవని పిల్లలకు నే ర్పాలి. ప్రతిరోజు మన పక్కవారితో, స్నేహితులతో, బంధువు లతో మాట్లాడడానికి కొంత సమయాన్ని కేటాయించండి. అదే నిజమైన జీవితం,
వ్యాసకర్త: అసిస్టెంట్ ప్రొఫెసర్, రాష్ట్రపతి
సేవా పురస్కార గ్రహీత
డాక్టర్ మొహమ్మద్ ఆజమ్ అలీ