14 ఏళ్ల బాలుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు!
గంభీరావుపేట, అక్టోబర్ 30 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన 14 ఏళ్ల మహమ్మద్ రెహాన్ అదృశ్యమయ్యాడు (Missing). ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కామారెడ్డిలోని ఓ మదర్సాలో చదువుతున్న రెహాన్ దసరా సెలవుల అనంతరం ఇంటికి వచ్చి ఉంటున్నాడు. ఈ నెల 25న ఉదయం 11:30 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిన బాలుడు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, పాఠశాల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు.
దీంతో బాలుడి తండ్రి మహమ్మద్ అబ్దుల్ రజాక్ గురువారం గంభీరావుపేట పోలీసులకు ఫిర్యాదు (Complaint) చేశారు. తన కుమారుడి అదృశ్యంపై అనుమానం ఉందని, ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండవచ్చని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు (Investigation) చేపట్టారు. బాలుడి ఆచూకీ గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ వెంకటేష్ తెలిపారు.