విజిలెన్స్ వారోత్సవం సందర్భంగా అవినీతి నిర్మూలనపై అవగాహన
జనగామ, అక్టోబర్ 30 (విజయక్రాంతి): విజిలెన్స్ వారోత్సవం 2026 లో భాగంగా అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా జనగామ మున్సిపాలిటీ(Jangaon Municipality) కార్యాలయంలో అవినీతి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం(Anti-Corruption Awareness) నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అవినీతి నిరోధక శాఖ వరంగల్ స్థాయి ఉప సంచాలకుడు పి.సాంబయ్య పాల్గొని సత్యనిష్ఠతో సమృద్ధి అనే అంశంపై అధికారులకు, సిబ్బందికి అవగాహన కల్పించారు. అవినీతికి దూరంగా ఉంటూ విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధత, పారదర్శకత పాటిస్తామని, అవినీతి రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిజాయితీతో, పక్షపాతం లేకుండా, బాధ్యతగా నిర్వహించాలని, అధికారాలను సొంత ప్రయోజనాలకు వాడుకోరాదని సూచించారు. అవినీతి వల్ల ప్రజాధనం వృథా కావడమే కాకుండా ప్రభుత్వ అభివృద్ధి పనులు, ప్రజా సేవలపై ప్రజల నమ్మకం దెబ్బతింటుందని వివరించారు.
ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఉచిత సంఖ్య 1064 కు ఫిర్యాదు చేయాలని కోరారు. పారదర్శక పాలన, సాంకేతిక వినియోగం, ఆకస్మిక తనిఖీలు, ఫిర్యాదులపై త్వరిత చర్యలతో అవినీతిని అరికట్టవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక ఇంజనీరు టి.రాజ్ కుమార్, జూనియర్ అధికారి సంతోషి, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.