జేబులోనే పేలిన పవర్ బ్యాంక్.. యువకుడికి తీవ్ర గాయాలు
హైదరాబాద్: నగరంలో పవర్ బ్యాంక్ పేలిన ఘటన కలకలం రేపింది. జేబులో పెట్టుకున్న పవర్ బ్యాంక్ ఒక్కసారిగా పేలడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన బుధవారం (నవంబర్ 25) ఉదయం 10 గంటల సమయంలో రహమత్ నగర్లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రహమత్ నగర్‌కు చెందిన శ్రవణ్ (29) తన జేబులో పవర్ బ్యాంక్ (Power Bank) పెట్టుకోగా, అది ఒక్కసారిగా పేలిపోయింది. పేలుడు తీవ్రతకు అతడి ఛాతి కుడివైపు భాగంతో పాటు కుడి కన్నుకు గాయాలయ్యాయి. సుమారు 30 శాతం మేర కాలిన గాయాలైనట్లు మధురానగర్ పోలీసులు వెల్లడించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని యూసుఫ్‌గూడలోని మ్యాగ్నైడ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి వైద్య చికిత్స (Medical Treatment) అందిస్తున్నారు.
కాగా, గతంలో సెప్టెంబర్ నెలలో ఓ ఎమ్మెల్యే వాహనంలోనూ ఇలాంటి పేలుడు సంభవించినట్లు పోలీసులు గుర్తుచేశారు. వరుసగా చోటుచేసుకుంటున్న ఇలాంటి ఘటనలతో ఎలక్ట్రానిక్ పరికరాల (Electronic Devices) భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. నాణ్యత లేని పవర్ బ్యాంకుల వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.