వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. చదివాక మాయం!
టెక్స్ట్ మెసేజ్‌లకూ View Once ఆప్షన్
ఒక్కసారి మాత్రమే చదివే అవకాశం
టెక్ డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్(WhatsApp) యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ఫొటోలు, వీడియోలు, వాయిస్ మెసేజ్‌లకు మాత్రమే ఉన్న ‘View Once’ సదుపాయాన్ని ఇక టెక్స్ట్ మెసేజ్‌లకూ విస్తరించనుంది. దీంతో పంపిన సందేశాన్ని అవతలి వ్యక్తి ఒక్కసారి మాత్రమే చదివే అవకాశం ఉంటుంది.
చదివిన తర్వాత మాయం!
ఈ ఫీచర్ ద్వారా పంపిన టెక్స్ట్ మెసేజ్(Text Messages)ను స్వీకర్త ఒకసారి ఓపెన్ చేసి చదివి చాట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్‌గా అదృశ్యమవుతుంది. తిరిగి అదే సందేశాన్ని ఓపెన్ చేసి చదవడం సాధ్యం కాదు. ఫొటోలు, వీడియోలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న View Once విధానాన్ని పోలినట్టుగానే ఇది పనిచేయనుంది.
కాపీ, స్క్రీన్‌షాట్‌లకు చెక్!
ఈ కొత్త సదుపాయంలో మెసేజ్‌లను కాపీ చేయడం, ఇతరులకు షేర్ చేయడం, స్క్రీన్‌షాట్ తీసుకోవడం వంటి చర్యలను కూడా పరిమితం చేసే అవకాశం ఉంది. అయితే మరో ఫోన్‌తో మెసేజ్‌ను ఫొటో తీసుకోవడాన్ని ఈ ఫీచర్ పూర్తిగా అడ్డుకోలేదని సమాచారం. కాబట్టి ఇది పూర్తి స్థాయి గోప్యతకు హామీ ఇచ్చే వ్యవస్థ కాదు.
బీటా యూజర్లకు అందుబాటులోకి
ప్రస్తుతం ఎంపిక చేసిన ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లకు మాత్రమే ఈ ఫీచర్‌ను అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది. యూజర్లు దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో వివరించే వీడియోను కూడా వాట్సాప్ విడుదల చేసే అవకాశం ఉంది. పరీక్షలు పూర్తయిన తర్వాత సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.
ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే వ్యక్తిగత సందేశాలు, తాత్కాలిక సమాచారాన్ని పంపుకునే వారికి ఉపయోగకరంగా ఉండనుంది. అయితే మెసేజ్‌ను ఎదుటివారు మరో విధంగా భద్రపరచకుండా పూర్తిగా నిరోధించలేమన్న విషయాన్ని యూజర్లు గుర్తుంచుకోవాలి.