యువకుడిలో గర్భసంచి!

12-09-2026 | 05:05am
  1. అందులోనే వృషణాలు
  2. అరుదైన లక్షణమన్న వైద్యుడు
  3. ఢిల్లీ ఆసుపత్రిలో వింతకేసు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: ఓ యువకుడి(young man)లో గర్భసంచి(Uterus) బయటపడింది. ఢిల్లీ(Delhi)లో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలను శుక్రవారం ఢిల్లీలోని ఆర్జి ఆసుపత్రి(RGI Hospital) చీఫ్ యురాలజిస్ట్ డాక్టర్ సుశీల్ ఖర్బందా(Sushil Kharbanda) మీడియాకు వెల్లడించారు. 26 ఏళ్ల యువకుడు సంతానలేమితో తమవద్దకు వచ్చాడని చెప్పారు. అతన్ని పరీక్షించగా వృషణాలు(Testicles) లేవని, అతడిలో శుక్రకణాలు విడుదలవడం లేదని గుర్తించామన్నారు. మరిన్ని పరీక్షలు నిర్వహించగా ఇతనిలో గర్భసంచి ఉన్నట్లు గుర్తించామని, ఆ సంచిలోనే వృషణాలు కూడా ఉన్నట్లు తేలిందన్నారు.

కోట్లలో ఒక్కరికి ఈ అరుదైన వ్యాధి ఉంటుందని దీన్నే వైద్య పరిభాషలో ‘పెర్సిస్టెంట్ ముల్లేరియన్ డక్ట్ సిండ్రోమ్ (పీఎండీఎస్)’ అంటారని వివరించారు. వీర్యంలో శుక్రకణాలు లేకపోవడాన్ని అజూస్పెర్మియా అంటారని అన్నారు. ఈ యువకుడికి సాధారణ మగవాడి లక్షణాలే ఉన్నాయని వివరించారు. ఇలాంటి వారికి పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువేనని చెప్పారు. ఇతనిలోని లక్షణాలు భవిష్యత్‌లో క్యాన్సర్‌కు దారి తీసే అవకాశం ఉండటంతో గర్భసంచి, వృషణాలను తొలగించామని చెప్పారు. ప్రస్తుతం అతడు క్షేమంగా ఉన్నాడని కోలుకుంటున్నాడని డాక్టర్ ఖర్బందా మీడియాకు వివరించారు.

మరిన్ని వార్తలు