చంద్రశేఖరన్‌పై కోర్టుకెక్కిన ట్రస్టులు

26-11-2026 | 01:40pm

ముంబై: దేశంలోని ప్రముఖ వ్యాపార సంస్థ టాటా గ్రూప్‌లో నాయకత్వ వివాదం ముదిరింది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ పునర్నియామకాన్ని సవాలు చేస్తూ సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, ఆర్.డి. టాటా ట్రస్ట్ బాంబే హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నియామకానికి సంబంధించిన బోర్డు తీర్మానం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని ట్రస్టులు ఆరోపిస్తున్నాయి.

సెప్టెంబర్ 17న జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల పాటు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే టాటా ట్రస్టులు నామినేట్ చేసిన డైరెక్టర్లు నోయల్ టాటా, వేణు శ్రీనివాసన్ ఈ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. నోయల్ టాటా వ్యతిరేకించగా, వేణు శ్రీనివాసన్ మద్దతు తెలిపారు. దీంతో సమావేశానికి అధ్యక్షత వహించిన హరీష్ మన్వానీ నిర్ణయాత్మక ఓటు వినియోగించి తీర్మానాన్ని ఆమోదించారు.

టాటా సన్స్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌లోని ఆర్టికల్ 121 ప్రకారం ట్రస్టులు నామినేట్ చేసిన డైరెక్టర్ల నుంచి అవసరమైన అనుకూల ఓట్లు రావాల్సిందేనని ట్రస్టులు వాదిస్తున్నాయి. ఛైర్మన్ వినియోగించిన నిర్ణయాత్మక ఓటుతో ఆ నిబంధనను అధిగమించలేరని పేర్కొంటున్నాయి. సెప్టెంబర్ 17న ఆమోదించిన తీర్మానాన్ని చెల్లనిదిగా ప్రకటించాలని, దాని ఆధారంగా కంపెనీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోర్టును కోరాయి.

ఈ వివాదం నేపథ్యంలో నవంబర్ 30న జరగనున్న టాటా సన్స్ బోర్డు సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. చంద్రశేఖరన్ పునర్నియామకంతో పాటు కంపెనీ భవిష్యత్ నిర్ణయాలు, లిస్టింగ్ అంశాలపై చర్చ జరగనున్న నేపథ్యంలో తమ నామినీ డైరెక్టర్ల ఓటింగ్ హక్కులకు రక్షణ కల్పించాలని ట్రస్టులు కోరుతున్నాయి. టాటా గ్రూప్ పాలన, నాయకత్వ వ్యవహారాలపై నెలకొన్న ఈ వివాదం ఇప్పుడు న్యాయస్థానానికి చేరడంతో తదుపరి పరిణామాలపై వ్యాపార వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు