అంతరిక్షంలో ఏఐ డేటా సెంటర్లు.. మస్క్‌కు గ్రీన్ సిగ్నల్
వాషింగ్టన్: టెక్నాలజీ ప్రపంచంలో మరో సంచలనానికి తెరలేవబోతోంది. భూమిపై కాకుండా అంతరిక్షంలోనే ఏఐ డేటా సెంటర్లు(AI Data Centers) ఏర్పాటు చేసేందుకు ఎలాన్ మస్క్(Elon Musk)కు చెందిన స్పేస్ఎక్స్ సిద్ధమైంది. ఇందుకోసం ఏకంగా 10 లక్షల వరకు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (United States Federal Communications Commission) అనుమతి ఇచ్చింది.
స్పేస్ఎక్స్ ప్రతిపాదించిన ఈ భారీ ప్రాజెక్టుకు ‘స్టార్మైండ్’ అని పేరు పెట్టారు. ఈ ఉపగ్రహాలు అంతరిక్షంలోనే భారీ మొత్తంలో డేటాను ప్రాసెస్ చేయగల కంప్యూటింగ్ వ్యవస్థలుగా పనిచేస్తాయి. భూమిపై ఉన్న వినియోగదారులకు అవసరమైన ఏఐ సేవలకు ఈ వ్యవస్థ ద్వారా మద్దతు అందించనున్నారు.
ఈ ప్రాజెక్టులో ఉపగ్రహాలు సౌరశక్తిని ప్రధానంగా వినియోగించుకోనున్నాయి. అంతరిక్షంలో ఎక్కువ సమయం సూర్యరశ్మి అందుబాటులో ఉండటంతో భారీ డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్‌ను సమకూర్చుకోవచ్చని స్పేస్ఎక్స్ భావిస్తోంది. తద్వారా భూమిపై డేటా సెంటర్లకు అవసరమయ్యే విద్యుత్, నిర్వహణ భారాన్ని తగ్గించే అవకాశం ఉంది.
FCC నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం 2033 నవంబర్ నాటికి ఉపగ్రహాల మోహరింపు ప్రారంభించాలి. 2035 నవంబర్ నాటికి కనీసం లక్ష ఉపగ్రహాలను, 2038 నవంబర్ నాటికి మొత్తం లక్ష్యంలో 50 శాతాన్ని కక్ష్యలోకి చేర్చాలి. మిగిలిన ఉపగ్రహాల విస్తరణకు 2040 వరకు గడువు ఉంది.
అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటు ఏఐ రంగంలో కొత్త మార్పులకు దారితీయవచ్చని టెక్నాలజీ నిపుణులు భావిస్తున్నారు. అయితే లక్షలాది ఉపగ్రహాల వల్ల అంతరిక్ష రద్దీ, వ్యర్థాలు, ఖగోళ పరిశోధనలపై ప్రభావం వంటి అంశాలపై ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా స్టార్మైండ్ ప్రాజెక్టు అమల్లోకి వస్తే అంతరిక్షం ఏఐ కంప్యూటింగ్‌కు మరో కీలక వేదికగా మారే అవకాశం ఉంది.