5 September, 2026 | 9:16 AM

వ్యాధుల కాలం.. పేదరోగులకు తప్పని పరీక్ష!

05-09-2026 | 05:55am
  1. టెస్టుల పేరుతో ప్రైవేట్ ఆసుపత్రుల కాసుల దందా
  2. ప్రతి టెస్టులో 6040 శాతం కమీషన్లు
  3. తీవ్రంగా నష్టపోతున్న నిరుపేదలు
  4. జిల్లా టీ హబ్ కేంద్రంలోనూ అరకొర టెస్టులు
  5. పట్టించుకోని వైద్యారోగ్య శాఖ
  6. ప్రజాప్రతినిధుల అండతో పెట్రేగిపోతున్న ఆసుపత్రి యాజమాన్యాలు

నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): సీజనల్ వ్యాధులు(Seasonal Diseases) నాగర్ కర్నూల్ జిల్లా ఆర్‌ఎంపి, పిఎంపి, ప్రైవేటు ఆసుపత్రులకు కాసుల వర్షం కురిపిస్తోంది. వాతావరణంలో జరిగిన మార్పుల కారణంగా దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులతో కూడిన జ్వరం ప్రతి ఒక్కరిని వణికిస్తోంది. గ్రామాల్లోని ఆర్‌ఎంపి, పి.ఎం.పిలు కనీస అర్హత లేకపోయినా ఫ్లూయిడ్స్, ప్రమాదకర యాంటీబయోటిక్ మందులను వినియోగిస్తూ వైద్యం అందిస్తున్నారు.

అవసరం లేకపోయినా టెస్టులకు పంపి ఒక్కో టెస్ట్ పై అరవై శాతం కమిషన్ పొందుతూ నిరుపేదల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ప్రాథమిక,  గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు సక్రమంగా పనిచేయని కారణంగా గ్రామీణ ప్రాంత జనం వైద్యం కోసం పట్టణాలకు పరుగులు పెడుతున్నారు. గల్లీ గల్లీకి పుట్టగొడుగుల్లా వెలిసిన పట్టణ కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రులకు కూడా సీజనల్ వ్యాధులను అనుకూలంగా మలుచుకుంటున్నారు. రోగి అనుమానాన్ని ఆసరాగా చేసుకొని వాటికి అనుగుణంగానే అవసరం లేకుండా టెస్టులకు పంపి లక్షల్లో డబ్బులు దండుకుంటున్నారు.

కనీస స్థాయి అర్హతలు లేకున్నా డయాగ్నస్టిక్ టెస్టులు జరపడంతో వారిచ్చిన రిపోర్టుల ఆధారంగానే వైద్యం అందించడంతో వైద్యం మరింత ముదిరి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న పరిస్థితి దాపురించింది. అయినా తనిఖీలు జరిపి నిలువరించాల్సిన జిల్లా వైద్యాధికారులు నెలవారి మామూలుగా తీసుకొని పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. మరికొంత మంది ఆర్‌ఎంపి పి.ఎం.పి ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు రాజకీయ అధికార బలంతో అడ్డగోలుగా వసూళ్ల దందాకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. 

అవసరం లేకున్నా టెస్టులా.?

జ్వరం, జలుబు, దగ్గు వంటి సాధారణ సమస్యలతో ఆసుపత్రులకు వెళ్లే రోగులకు కూడా సీబీపీ, షుగర్, హెచ్బీఏ1సీ, లివర్, కిడ్నీ, థైరాయిడ్, విటమిన్-డి, విటమిన్-బి12 తదితర పరీక్షలు సూచిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో రోగికి అనేక పరీక్షలు రాయడంతో బిల్లులు వేల రూపాయలకు చేరుతున్నా యని పలువురు రోగులు చెబుతున్నారు.

6040 కమీషన్ 

ఆర్.ఎం.పి, పిఎంపి, ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాల మధ్య సాగుతున్న కమీషన్ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి టెస్టులో 6040 శాతం వరకు కమీషన్ చేతులు మారుతోందనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఏరియా ఆసుపత్రులు జిల్లా జనరల్ ఆసుపత్రులకు దగ్గర్లో ప్రైవేటు ఆసుపత్రులు డయాగ్నస్టిక్స్ సెంటర్స్ నెలకొల్పి వైద్యాన్ని వ్యాపారంగా మలుచుకున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా మెడికల్ కళాశాల పరిసరాల్లో ఏర్పాటుచేసిన డయాగ్నొస్టిక్ సెంటర్లో అరకొరా పరీక్షలు జరపడంతో ఇతర డయాగ్నొస్టిక్ సెంటర్స్, ప్రైవేటు ఆసుపత్రులకు వరంగా మారిందని స్థానికంగా చర్చ జరుగుతుంది. 

అధికారుల పర్యవేక్షణ ఏదీ.?

జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వాటిపై వైద్యారోగ్య శాఖ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించడం లేదనే విమర్శలు ఉన్నాయి. నకిలీ వైద్యులు ఆర్‌ఎంపి పి.ఎం.పి ఎంబిబిఎస్ బోర్డులో నెలకొల్పి నకిలీ వైద్యం చేస్తున్నట్లు గతంలో బయటపడిన వారిపై చర్యలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం యధాతథంగా వైద్యం అందిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. పరీక్షల ధరలు, రోగులకు అందిస్తున్న బిల్లులు, ఆసుపత్రుల అనుమతులు, వైద్య సేవల నిబంధనలపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రజాప్రతినిధుల అండదండలు. 

కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు రాజకీయ నేతల చుట్టూ తిరుగుతూ ప్రజాప్రతినిధుల అండదండలతోనే అధికారులపై ఒత్తిడి తెస్తున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజా ప్రతినిధులు సైతం పేద రోగులకు వైద్యం అందకపోయినా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలున్నాయి. రాజకీయ జోక్యాలకు తావులేకుండా అధికారులు స్వతంత్రంగా తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

‘వైద్యం’ వ్యాపారంగా మారిందా?

రోగుల ప్రాణాలతో ముడిపడి ఉన్న వైద్య రంగంలో కమీషన్లకు తావు లేకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అవసరమైన పరీక్షలు మాత్రమే చేయించేలా మార్గదర్శకాలు అమలు చేయడంతో పాటు, అధిక మొత్తంలో వసూళ్లు, అనవసర పరీక్షలు, కమీషన్ వ్యవహారాలపై జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిజానిజాలను నిగ్గుతేల్చాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు