సోన్ పాపిడీకే ఫస్ట్ ప్లేస్.. స్వీట్ మార్కెట్‌లో పండుగ జోష్!

07-11-2026 | 12:04pm

దీపావళి పండుగ వేళ హైదరాబాద్‌లో స్వీట్ల విక్రయాలు (Sweet Sales) జోరందుకున్నాయి. పండుగ సందడి ఒకవైపు.. స్వీట్లు, డ్రైఫ్రూట్స్ కొనుగోళ్లతో మార్కెట్లు మరోవైపు కళకళలాడాయి. ఈ ఏడాది నగరంలో ఏకంగా 3,000 నుంచి 3,500 టన్నుల వరకు స్వీట్లు అమ్ముడైనట్లు వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి స్వీట్లకు గిరాకీ గణనీయంగా పెరిగింది.

ఈ దీపావళి సీజన్‌లో సోన్ పాపిడీ స్వీట్లకు అత్యధిక ఆదరణ లభించింది. ఆ తర్వాత మిక్స్‌డ్ స్వీట్లు, మోతీచూర్ లడ్డూలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపారు. బంధుమిత్రులకు కానుకలుగా ఇచ్చేందుకు స్వీట్ బాక్సులు (Sweet Boxes), డ్రైఫ్రూట్ ప్యాకెట్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. దీంతో స్వీట్ షాపుల వద్ద పండుగ సందడి కనిపించింది.

వ్యాపారుల అంచనాల ప్రకారం గతేడాదితో పోలిస్తే ఈసారి స్వీట్ల ఆర్డర్లు 20 శాతానికి పైగా పెరిగాయి. పండుగకు ముందే చాలామంది స్వీట్లు, డ్రైఫ్రూట్స్ కోసం ముందస్తు బుకింగ్స్ (Pre-orders) చేయడంతో వ్యాపారులకు మంచి గిరాకీ ఏర్పడింది.

ఒకవైపు అమ్మకాలు పెరిగితే.. మరోవైపు వినియోగదారుల జేబులకు మాత్రం కాస్త చిల్లు పడింది. పాలు, నెయ్యి, చక్కెర, డ్రైఫ్రూట్స్ వంటి ముడిసరుకుల ధరలు పెరగడంతో స్వీట్ల ధరలు గతేడాదితో పోలిస్తే 15 నుంచి 20 శాతం వరకు పెరిగాయి.

మొత్తంగా ఈ దీపావళి హైదరాబాద్ స్వీట్ మార్కెట్‌కు భారీ ఊపునిచ్చింది. ధరలు పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గలేదు. పండుగ పూట తీపి పంచేందుకు నగరవాసులు పోటీపడటంతో స్వీట్ వ్యాపారులకు ఈ సీజన్ మంచి వ్యాపారాన్ని తెచ్చిపెట్టింది.

మరిన్ని వార్తలు