గాల్లో ఎగిరే కారు.. ఎప్పుడైనా చూశారా..?

23-11-2026 | 12:07pm

రోడ్డుపై కారు నడపడం చూశాం.. ఆకాశంలో విమానాలు ఎగరడం చూశాం.. కానీ కారు కూడా విమానంలా గాల్లోకి ఎగిరితే? వినడానికి సినిమా సీన్‌లా ఉన్నా.. చైనా(China) మాత్రం ఇలాంటి ప్రయోగాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

చైనా అంటేనే వింత ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్. టెక్నాలజీ విషయంలో ఎప్పటికప్పుడు కొత్తదనం చూపించే డ్రాగన్ దేశం(Dragon Country).. ఇప్పుడు మరో సంచలన ప్రయోగంతో వార్తల్లో నిలిచింది. రోడ్డుపై పరుగులు పెట్టడమే కాదు.. అవసరమైతే గాల్లోకి ఎగిరే ఫ్లయింగ్ కారును పరీక్షించినట్లు ప్రకటించింది. హునాన్ ప్రావిన్స్‌లోని చాంగ్షా నగరంలో ఈ ప్రయోగం నిర్వహించారు. ఈ ప్రయోగంలో వాహనం సుమారు 50 అడుగుల ఎత్తు వరకు ఎగిరింది. 

సాధారణంగా విమానాలు, ఫ్లయింగ్ కార్లకు రెక్కలు ఉండటం చూస్తుంటాం. కానీ ఈ ప్రయోగంలో ప్రత్యేక ఆకర్షణ దాని డిజైన్. సాధారణ కారులా కనిపించే ఈ వాహనం రెక్కలు లేకుండానే గాల్లోకి ఎగిరేలా రూపొందించినట్లు చెబుతున్నారు. రోడ్డుపై ప్రయాణించడంతో పాటు గాల్లోనూ ప్రయాణించేలా దీన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తయారీదారులు వెల్లడించారు.

ఈ ప్రోటోటైప్ వాహనంలో నలుగురు ప్రయాణించేందుకు వీలుగా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. భవిష్యత్తులో పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టడంతో పాటు ప్రయాణ సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నట్లు ఇంజినీర్లు చెబుతున్నారు.

ఫ్లయింగ్ కార్ల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ రంగంలో చైనా ప్రయోగాలు టెక్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే ఈ వాహనం గాల్లో ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? ఎంత దూరం వెళ్లగలదు? బ్యాటరీతో నడుస్తుందా? పూర్తి స్థాయి వాణిజ్య వినియోగానికి ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? అనే వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

ఒకప్పుడు సినిమాల్లో మాత్రమే కనిపించిన ఎగిరే కార్లు.. ఇప్పుడు నిజ జీవితంలోకి వస్తున్నాయా? చైనా ప్రయోగాలు చూస్తుంటే భవిష్యత్తులో రోడ్లపైనే కాదు.. ఆకాశంలోనూ ట్రాఫిక్ జామ్‌లు కనిపిస్తాయేమో! 

మరిన్ని వార్తలు