హైదరాబాద్‌లో డోర్‌డాష్‌ కొత్త టాలెంట్‌ హబ్‌

02-10-2026 | 06:35pm

హైదరాబాద్: ప్రపంచంలోని ప్రముఖ స్థానిక వాణిజ్య వేదికల్లో డోర్‌డాష్‌(DoorDash) ఒకటి. హైదరాబాద్‌లో తమ తొలి టాలెంట్‌ హబ్‌(Talent Hub)ను ఏర్పాటు చేయడం ద్వారా భారత్‌లోకి అడుగుపెడుతోంది. తెలంగాణలోని ప్రతిభ, ఆవిష్కరణల వ్యవస్థపై దీర్ఘకాలిక నిబద్ధతను ఇది చాటుతోంది. తొలుత 500 మంది ఉద్యోగులతో ప్రారంభించి, కాలక్రమంలో ఉద్యోగుల సంఖ్యను 3,000కు పైగా పెంచాలని సంస్థ యోచిస్తోంది.   

తెలంగాణ ప్రభుత్వ సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, పరిశ్రమలు & వాణిజ్యం, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి డి. శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.  డోర్‌డాష్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రవి ఇనుకొండ, డోర్‌డాష్ వర్క్‌ఫోర్స్ స్ట్రాటజీ అండ్ టాలెంట్ అక్విజిషన్ ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్ జెన్నా కోంకే, తెలంగాణ ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయి కృష్ణ  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

హైదరాబాద్‌లోని ఈ కేంద్రం ప్రపంచవ్యాప్తంగా డోర్‌డాష్‌కు చెందిన మూడో అంతర్గత సీఎక్స్‌ఐ సర్వీస్‌ సెంటర్‌ కానుంది. మిగిలిన రెండు టెంపే, అరిజోనా, మెక్సికో సిటీలలో ఉన్నాయి. డోర్‌డాష్‌ యొక్క అంతర్జాతీయ కార్యకలాపాలకు హైదరాబాద్‌ కేంద్రం మద్దతు అందించనుంది. డోర్‌డాష్‌ కార్యకలాపాలు సాగిస్తున్న వివిధ ప్రాంతాల్లో వినియోగదారులు, వ్యాపారులు, డాషర్లు నమ్మకమైన సేవలు పొందేందుకు ఇది తోడ్పడనుంది. ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్‌కు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో 56 మిలియన్లకు పైగా నెలవారీ క్రియాశీల వినియోగదారులకు సేవలందిస్తున్న డోర్‌డాష్‌ అంతర్జాతీయ వేదికకు హైదరాబాద్‌ బృందం మద్దతు అందించనుంది.

మంత్రి శ్రీ డి. శ్రీధర్ బాబు మాట్లాడుతూ “ తమ వేగవంతమైన వృద్ధికి అవసరమైన సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి డోర్‌డాష్ హైదరాబాద్‌ను ఎంచుకోవడం, హైదరాబాద్ ఒక గ్లోబల్ టాలెంట్ హబ్‌గా ఎంతగానో ఎదిగిందనడానికి  బలమైన నిదర్శనం. ప్రపంచంలోని ప్రముఖ లోకల్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా,  డోర్‌డాష్ 40కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2025లో ఇది 100 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్‌ప్లేస్ గ్రాస్ ఆర్డర్ వాల్యూను నమోదు చేసింది. దీని హైదరాబాద్ హబ్ 3,000 మందికి పైగా ఉద్యోగులతో విస్తరిస్తుందని, తద్వారా హైపర్‌లోకల్ కామర్స్, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్, టెక్నాలజీ, ఆపరేషన్స్‌లో గ్లోబల్ సామర్థ్యాలను హైదరాబాద్‌కు తీసుకువస్తుందని అంచనాగా చెప్పారు.

"భారతదేశంలో డోర్‌డాష్‌ తొలి హబ్‌ను ఏర్పాటు చేయడం మా గ్లోబల్‌ ఆపరేషన్స్‌ నెట్‌వర్క్‌ను విస్తరించడంలో ఒక ముఖ్యమైన మైలురాయి" అని డోర్‌డాష్‌లో వర్క్‌ఫోర్స్ స్ట్రాటజీ, టాలెంట్ అక్విజిషన్ ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్ జెన్నా కోంకే అన్నారు. డోర్‌డాష్ తమ హైదరాబాద్ హబ్ కోసం నేరుగా ఉద్యోగులను నియమించుకుంటోంది. ప్రారంభంలో సుమారు 500 మంది ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తోంది, కాలక్రమేణా ఈ సంఖ్యను 3,000కు పైగా పెంచే అవకాశం ఉంది. ఈ పెట్టుబడి హైదరాబాద్ యొక్క అపారమైన ప్రతిభా వనరులు, టెక్నాలజీ ఎకోసిస్టమ్‌ను సద్వినియోగం చేసుకోవడంతో పాటు, దీర్ఘకాలిక కెరీర్ అవకాశాలను కూడా సృష్టించనుంది.

మరిన్ని వార్తలు