పెరిక కులస్తులు రాజకీయ, సామాజికంగా ఎదగాలి

02-10-2026 | 09:47pm

- రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షులు గటిక విజయ్ కుమార్

నస్పూర్, అక్టోబర్ 2: పెరిక కులస్తులు రాజకీయ, సామాజికంగా ఎదగాలని పెరిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గటిక విజయ్ కుమార్(Gatika Vijay Kumar) ఆకాంక్షించారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని PVR Gardenలో పెరిక సంఘం సింగరేణి కన్వీనర్ పేరం రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సింగరేణి పెరిక కుల ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆవిర్భావ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.

సింగరేణి సంస్థలో పెద్ద సంఖ్యలో పెరిక కులానికి చెందిన ఉద్యోగులు పనిచేస్తున్నారని, కష్టాన్ని నమ్ముకుని పనిచేసే పెరిక ఉద్యోగులకు సింగరేణిలో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. సింగరేణి పెరిక కుల ఉద్యోగుల సంక్షేమ సంఘం ద్వారా ఉద్యోగుల, కార్మిక సమస్యలు, సంక్షేమ అంశాలను పరిష్కరించుకునేందుకు కృషి చేయడంతో పాటు ఉద్యోగుల మధ్య పరస్పర సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవచ్చని అన్నారు. పెరిక ఉద్యోగులు కేవలం ఉద్యోగ పరంగానే కాకుండా రాజకీయంగా, సామాజికంగా కూడా ఎదగాలని పిలుపునిచ్చారు.

సమాజంలో పెరిక కులానికి మరింత గుర్తింపు, ప్రాతినిధ్యం రావడానికి ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు. రాబోయే రోజుల్లో సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కమిటీలను ఏర్పాటు చేసి సంఘాన్ని బలోపేతం చేస్తామని తెలిపారు. రాష్ట్ర సంఘానికి అనుబంధంగా వివిధ విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అందులో భాగంగా సింగరేణి పెరిక సంక్షేమ సంఘం ట్రస్ట్ ఏర్పాటు చేయడంతో పాటు సింగరేణిలోని 12 ఏరియాల్లో ఏరియా కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 

విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత...

హైదరాబాద్‌లో 50 సంవత్సరాలుగా పెరిక హాస్టల్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నామని రాష్ట్ర అధ్యక్షులు తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు విద్యాపరంగా చేయూత అందిస్తున్నామని చెప్పారు. ఎల్‌బీనగర్‌లో మహిళా విద్యార్థుల కోసం హాస్టల్ భవనం ఏర్పాటు చేస్తున్నామని, అలాగే ప్రభుత్వ సహకారంతో కోకాపేటలో రెండు ఎకరాల స్థలాన్ని భవన నిర్మాణం కోసం కేటాయించినట్లు తెలిపారు.

ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, ఇప్పటికే ఆరు అంతస్తుల వరకు స్లాబ్ పనులు పూర్తయ్యాయని, తొమ్మిది అంతస్తుల వరకు భవనాన్ని నిర్మించనున్నట్లు వివరించారు. అదేవిధంగా మంచిర్యాలలో పెరిక హాస్టల్ భవనాన్ని పూర్తిచేసుకోవడం తమ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉండాలని, విద్యార్థులకు మెరుగైన విద్యా, వసతి సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పెరిక సంఘం కేవలం పెరిక కులస్తుల సంక్షేమానికే పరిమితం కాకుండా, ఇతర కులాలు, పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు కూడా అవసరమైన సమయంలో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్, కోకాపేట భవన వైస్ చైర్మన్ చుంచు ఉషన్న, పెరిక హాస్టల్ జనరల్ సెక్రటరీ అచ్చ రఘుకుమార్, రాష్ట్ర నాయకులు బోడకుంట ప్రకాష్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కందుల సంధ్యారాణి, జిల్లా అధ్యక్షులు బొడ్డు శంకర్, జిల్లా జనరల్ సెక్రటరీ డాక్టర్ రాజ్‌కిరణ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు అత్తి సరోజ, అక్కల రమేష్, ఒడ్డె రాజమౌళి, మోటపలకుల తిరుపతి, మేడం తిరుపతి, నెల్కి మల్లేష్, మండల అధ్యక్షులు ఎంబడి కుమారస్వామి, పెట్టెం లక్ష్మణ్, బేర సత్యనారాయణ, రెంక రవి తదితరులు పాల్గొన్నారు.

శ్రీరాంపూర్ ఏరియా కమిటీ

సింగరేణి పెరిక కుల ఉద్యోగుల సంక్షేమ సంఘం శ్రీరాంపూర్ ఏరియా కమిటీ అధ్యక్షులుగా తీర్థాల సదానందం (S&PC), ఉపాధ్యక్షులుగా ఆకుల కృష్ణంరాజు, జనరల్ సెక్రటరీగా కారకూరి శ్రీనివాస్, సెక్రటరీగా ఎంబడి శ్రీనివాస్, కోశాధికారిగా పేరం మనోహర్ లను ఎన్నుకున్నారు.

మరిన్ని వార్తలు