కలెక్టర్ కే మస్కా ...
- ప్రభుత్వ భూమిలో రేకుల షెడ్లకు ఇంటి పన్ను రసీదులు....
- జీపీ కార్యదర్శి రెవెన్యూ అధికారుల కుమ్మక్కు?
- ప్రేక్షక పాత్రలో మండల అధికారులు
- నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమికి పరిహారం
సింగరేణి అక్టోబర్ 02 విజయ క్రాంతి: ఖమ్మం జిల్లా సింగరేణి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూమిలో భారీ అక్రమం వెలుగులోకి వచ్చింది. సింగరేణి పంచాయతీ కార్యదర్శి రెవెన్యూ అధికారులు కలిసి ఈ ప్రభుత్వ భూమి వ్యవహారంలో సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ నే తప్పు దోవ పట్టించారు. కలెక్టర్ నే మస్కా కొట్టించిన ఘనులు తప్పించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
అక్రమ నిర్మాణాలకు జీపీ ఇంటి నంబర్లు...
సింగరేణి గ్రామ పంచాయతీ పరిధిలోని 442 సర్వే నెంబర్ లోని ప్రభుత్వ భూమిలో ఎకరం ముప్పై గుంటల ప్రభుత్వ భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉంది. ఈ భూమిలో గతంలో కొందరికి ప్రభుత్వం అసైన్మెంట్ పట్టాలు జారీచేసింది. కొందరు ఆక్రమించుకుని రేకుల ఇళ్ళు నిర్మించుకున్నారు. రైల్వే డబుల్ లైన్ భూ సేకరణ పనుల్లో ప్రభుత్వ భూమిలో ఉన్న ఇళ్లన్నీ పోతున్నాయి.
అసైన్మెంట్ పట్టాలు పొందిన వారితో పాటు రేవతి, మల్లమ్మ అనే ఇద్దరు మహిళలు కూడా ఈ ప్రభుత్వ భూమిలో అక్రమంగా రేకుల షెడ్లు వేసుకున్నారు. వీరికి ఎటువంటి పత్రాలు లేక పోవడంతో సింగరేణి రెవెన్యూ అధికారులు మొదట వీరికి రైల్వే పరిహారం కోసం సిఫారసు చేయడం సాధ్యం కాదని తిరస్కరించారు. ఇంటి పన్ను రసీదులు ఉంటే సిఫారసు చేస్తామని చెప్పడంతో జీపీ సెక్రటరీ ని ఆశ్రయించారు.
స్థలానికి పత్రాలు లేవు... జీపీ రికార్డులో నమోదు లేదు..
ప్రభుత్వ భూమిలో ఆక్రమణలో వున్న రేవతి, మల్లమ్మ లకు భూమికి సంబంధించి ఎటువంటి పత్రాలు లేవు. గ్రామ పంచాయతీ రికార్డులో కూడా నమోదు కాలేదు. జీపీ కార్యదర్శి రెవెన్యూ అధికారులు కుమ్మక్కు అయి ఆక్రమణలకు హక్కులు కల్పిస్తూ అక్రమానికి తెరలేపారనే ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూమిలో అసైన్ మెంట్ పట్టాలు పొంది ఇళ్లు కోల్పోయిన వారికి మాత్రమే రైల్వే శాఖ పరిహారం అందించాలి. కానీ ఇక్కడ అధికారులు ఆ నిబంధనలు తుంగలో తొక్కి ప్రభుత్వ భూమినీ ఆక్రమించుకున్న వారికి ఎటువంటి పత్రాలు లేని వారికి కూడా సిఫారసు చేసి అక్రమంగా పరిహారం ఇప్పించారనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రేక్షక పాత్రలో మండల అధికారులు...
నిబంధనలు తుంగలో తొక్కి అక్రమంగా జరిగిన వ్యవహారం లో మండల అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం పై కూడా చర్చ జరుగుతోంది. రైల్వే శాఖ అందించే పరిహారం బాధితులకు చెల్లించే అంతిమ అధికారం ఉన్న జిల్లా కలెక్టర్ ను కూడా పక్క దారి పట్టించిన ఈ అక్రమం పై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది..