దేశ సమగ్రత, ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
రాజ్యాంగ వ్యవస్థల నిర్వీర్యాన్ని అడ్డుకోవాలి.
గాంధీజీ, అంబేడ్కర్ ఆశయాల సాధనకు పునరంకితమవ్వాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా
కొత్తగూడెం టౌన్, (విజయక్రాంతి): దేశ సమగ్రతను, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడానికి ప్రతిఒక్కరూ నడుం బిగించాలని, మతోన్మాదం లేని సమసమాజ నిర్మాణం కోసం ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని సిపిఐ జిల కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా(CPI District Secretary S.K. Sabir Pasha) పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ పిలుపు మేరకు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సెంటర్లో 'మత సామరస్య దినోత్సవం' ఘనంగా నిర్వహించారు. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి దేశ సమగ్రతను, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
అనంతరం జరిగిన సభలో సాబీర్ పాషా మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం ఒక్క నిమిషం కూడా పోరాడని శక్తులు నేడు దేశభక్తి ముసుగులో విభజన రాజకీయాలు చేస్తూ లౌకిక పునాదులను దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు. ఈ దేశ ఐక్యత, సద్భావన కోసం గాంధీజీ ప్రాణత్యాగం చేస్తే, అంబేడ్కర్ సమసమాజం కోసం రాజ్యాంగాన్ని అందిస్తే, నేడు పాలకులు ఆ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ మధ్యయుగాల వైపు నడిపించే కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం, సీబీఐ, ఈడీ వంటి రాజ్యాంగబద్ధ స్వతంత్ర సంస్థలను రాజకీయ కీలుబొమ్మలుగా మార్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
దేశాన్ని ముక్కలు కానివ్వబోమని ఎర్రజెండా ఆధ్వర్యంలో సమైక్యత కోసం కమ్యూనిస్టులు నిరంతరం పోరాడారని, శాస్త్రీయ పద్ధతుల్లో దేశాన్ని ముందుకు నడిపించేందుకు నవతరం సిద్ధం కావాలన్నారు. సభలో మేయర్ మూడ్ గణేష్, నాయకులు కంచర్ల జమలయ్య, వి పూర్ణచందర్ రావు, వాసిరెడ్డి మురళి, భూక్య దస్రు, ఉప్పుశెట్టి రాహుల్, తదితరులు పాల్గొన్నారు.