భక్తికి మోకరిల్లిన పిఎసిఎస్ చైర్మన్
బడా పహాడ్ దర్గాలో మోకాళ్లపై 1,100 మెట్లు ఎక్కి మొక్కు
కంగ్టి,(విజయక్రాంతి): భక్తి ఉంటే కొండలైనా చిన్నవే సంకల్పం ఉంటే కష్టమైన లక్ష్యమైనా సాధ్యమేనని నిరూపించారు. కంగ్టి మండలం తుర్కవడ్గం గ్రామానికి చెందిన పీఏసీఎస్ చైర్మన్ మారుతి రెడ్డి(PACS Chairman Maruti Reddy). నిజామాబాద్ జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన బడా పహాడ్ దర్గా(Bada Pahad Dargah)లో గురువారం ఆయన మోకాళ్లపై సుమారు 1,100 మెట్లు ఎక్కి తన భక్తిశ్రద్ధలను చాటుకున్నారు.
గుట్టపై కొలువుదీరిన సయ్యద్ బాబా,షాదుల్లా హుస్సేన్‌ల దివ్య దర్శనం కోసం మారుతి రెడ్డి దాదాపు రెండు గంటల పాటు శ్రమించి మోకాళ్లపై మెట్లు ఎక్కినట్లు తెలిపారు. గుట్టపైకి చేరుకున్న అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కులమతాలకు అతీతంగా భక్తులు సందర్శించే బడా పహాడ్ దర్గాలో మారుతి రెడ్డి చూపిన భక్తి,ఆధ్యాత్మిక నిబద్ధత పలువురిని ఆకట్టుకుంది.శారీరక శ్రమను సైతం లెక్కచేయకుండా మొక్కును పూర్తి చేయడం అక్కడి భక్తుల దృష్టిని ఆకర్షించింది.