నీరు..విద్యుత్ పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించండి

22-10-2026 | 04:50pm

ములుగు జిల్లా రెడ్ క్రాస్ భవనానికి నిధులు కేటాయిస్తాం          

మంత్రి సీతక్కను కలిసిన రెడ్ క్రాస్ పాలకమండలి సభ్యులు

ములుగు,(విజయక్రాంతి): ఎల్ నినో ప్రభావం(El Niño impact)తో ఏర్పడిన కరువు పరిస్థితులను ఎదురుకోవడానికి ప్రజలను సన్నద్ధం చేయడానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ(Indian Red Cross Society) విస్తృతంగా కృషి చేయాలని మంత్రి సీతక్క(Minister Seethakka) సూచించారు. ములుగు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ అల్లెం అప్పయ్య ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన జిల్లా పాలక మండలి సభ్యులు గురువారం మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా తన క్యాంపు కార్యాలయంలో కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ప్రజలు విద్యుత్తు, సాగు, తాగునీటి పొదుపు పై దృష్టి సారించాలని సూచించారు. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. ప్రజలను అప్రమత్తం చేసి ఇలాంటి విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు తన వంతు పాత్ర పోషించాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవన నిర్మాణం కోసం అవసరమైన నిధులు కేటాయిస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

వెంటనే భవన నిర్మాణం కోసం ప్రతిపాదనలను సిద్ధం చేయాలని పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ అధికారి లింగారెడ్డిని ఆదేశించారు. మంత్రిని కలిసిన వారిలో జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీనివాస్, కార్యదర్శి కొట్టే రాజిరెడ్డి, కోశాధికారి శిరుప సతీష్ కుమార్, జిల్లా పాలక మండలి సభ్యులు గూడూరు మహిపాల్, కోగిల సారయ్య, రవితేజ, రామిడి కృష్ణారెడ్డి, ముక్కు సుబ్బారెడ్డి, చుంచు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు