గిరిజనుల విన్నపాలను త్వరితగతిన పరిష్కరించాలి

05-10-2026 | 05:30pm

అర్హులైన గిరిజనులకు  నిర్ణీత గడువులోగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేలా చొరవ చూపాలి 

ఐటీడీఏ పీవోబి రాహుల్

భద్రాచలం టౌన్,(విజయక్రాంతి): గిరిజనుల(Tribals) నుంచి స్వీకరించే ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా ఐటీడీఏ యూనిట్ అధికారులు(ITDA Officer) కృషి చేయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్(ITDA Officer Rahul) సంబంధిత యూనిట్ అధికారులకు ఆదేశించారు. సోమవారం  ఐటీడీఏ సమావేశం మందిరంలో  నిర్వహించిన గిరిజన దర్బార్ లో ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డీడీ ట్రైబల్ వెల్ఫేర్ చందన, ఎస్ డి సి ఆనంద్ కుమార్, ఆర్సీ.ఓ గురుకులం అరుణకుమారి, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, ఏడీఎంహెచ్ఓ సైదులతో కలిసి గిరిజనుల నుంచి దరఖాస్తులు , సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించారు.

భూ సంబంధిత సమస్యలు, పోడు పట్టాల సమస్యలు, సంక్షేమ పథకాలు(Welfare Schemes), ఉపాధి, పింఛన్లు, గృహాలు, మౌలిక వసతులు, సామాజిక భద్రత తదితర అంశాలపై ప్రజలు తమ సమస్యలను పిఓ కు విన్నవించారు. ఈ సందర్భంగా పిఓ మాట్లాడుతూ గిరిజనుల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి పరిష్కారం చూపేందుకు గిరిజన దర్బార్  కీలక వేదికగా పనిచేస్తుందన్నారు. గిరిజన దర్బార్(Tribal Durbar)లో ప్రతి దరఖాస్తును అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి తావివ్వరాదని ఆయన అన్నారు.

తక్షణమే పరిష్కరించగల సమస్యలను ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించాలని, క్లిష్టమైన సమస్యలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తూ గిరిజన దర్బార్ దరఖాస్తుల పరిష్కార స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఐటీడీఏ యూనిట్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో పవర్ వేణు, పివిటిజి అధికారి గన్యా, ఏవో సున్నం రాంబాబు, జేడీఎం హరికృష్ణ, మిషన్ భగీరథ ఏ ఈ ఈ వసుంధర తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు