అమెరికాలో జిల్లా యువతి మృతి

05-10-2026 | 06:38pm

సింహాద్రి నగర్ నివాసి సుప్రియ మృతి చెందడం పట్ల  మంత్రి పొంగులేటి తీవ్ర విచారం

మృతదేహాన్ని త్వరగా ఇండియా తీసుకొచ్చేందుకు కృషి 

కుటుంబ సభ్యులను ఓదార్చిన  క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ దయాకర్ రెడ్డి 

ఖమ్మం,(విజయక్రాంతి): ఏదులాపురం మున్సిపాలిటీ(Edulapuram Municipality) పరిధిలోని సింహాద్రి నగర్‌కు చెందిన దారం సుప్రియ అమెరికా(America)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy)తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సుప్రియ మృతి చెందిన విషయం తెలుసుకుని ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన చర్యలు వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

మృతురాలి కుటుంబ సభ్యులకు దయాకర్ రెడ్డి పరామర్శ

మంత్రి పొంగులేటి సూచనల మేరకు ఖమ్మం క్యాంప్ కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి సోమవారం సింహాద్రినగర్‌లోని సుప్రియ నివాసానికి వెళ్లారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డికి ఫోన్ చేయగానే.. మృతురాలి కుటుంబ సభ్యులతో స్వయంగా మాట్లాడి.. ఓదార్చారు. అలాగే.. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అమెరికాలోని భారత రాయభార కార్యాలయ ఉన్నతాధికారులతో పలుమార్లు సంప్రదించానని, వీలైనంత త్వరగా మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. 

ఈ కార్యక్రమంలో..: ఏదులాపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకబత్తిని అనిత, వైస్‌చైర్మన్‌ తమ్మినేని నవీన్‌, మున్సిపాలిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బానోత్‌ కిషోర్‌, గరికపాటి ఆంజనేయ ప్రసాద్‌, పలువురు కౌన్సిలర్లు, స్థానిక కాంగ్రెస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు