పారిశుధ్య కార్మికులకు పీపీఈ కిట్ల పంపిణీ
ఇల్లెందు టౌన్ అక్టోబర్ 2 (విజయక్రాంతి): పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఇల్లెందు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కార్మికులకు పీపీఈ కిట్లు పంపిణీ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) పాల్గొని కార్మికులకు పీపీఈ కిట్లు అందజేశారు. ముందుగా కౌన్సిలర్లతో కలిసి గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇల్లెందు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకమన్నారు.
కార్మికుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని పీపీఈ కిట్లు అందిస్తున్నట్లు తెలిపారు. పట్టణ పరిశుభ్రత బాధ్యత కార్మికులతో పాటు ప్రజలపైనా ఉందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతో ఇల్లెందును సుందరీకరణతో కూడిన పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర డానియల్, వైస్ చైర్మన్ పెండ్యాల రాజు, కమిషనర్ సందీప్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బోళ్ల సూర్యం, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.