అధికారుల నిర్లక్ష్యంతోనే బిల్లుల జాప్యం

21-09-2026 | 07:12pm
  1. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి.
  2. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు గోనె మణి

కొత్తగూడెంటౌన్, (విజయక్రాంతి): ఐసీడీఎస్ పీడీ, సంబంధిత అధికారుల తీవ్ర నిర్లక్ష్యం వల్లే అంగన్వాడీ బిల్లులు సకాలంలో మంజూరు కావడం లేదని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్(Anganwadi Workers and Helpers Association) జిల్లా అధ్యక్షురాలు గోనె మణి మండిపడ్డారు. సోమవారం స్థానిక ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం 'శేషగిరిభవన్'లో నిర్వహించిన సంఘ జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అధికారులు సకాలంలో బిల్లులను ప్రభుత్వానికి సమర్పించకపోవడం వల్లే తీవ్ర జాప్యం జరుగుతోందని ఆమె ఆరోపించారు.

2025 నుంచి నేటివరకు అంగన్వాడీ కేంద్రాల అద్దె బిల్లులు చెల్లించకపోవడంతో, భవనాల యజమానులు కేంద్రాలను తక్షణమే ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరు నెలలుగా ఆరోగ్య లక్ష్మి మెనూ బిల్లులతో పాటు గ్యాస్ సిలిండర్ల బిల్లులను సైతం విడుదల చేయకుండా టీచర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా కేంద్రాలకు నిత్యావసర సరుకుల సరఫరా సక్రమంగా జరగడం లేదని, దీంతో క్షేత్రస్థాయిలో నిర్వహణ భారంగా మారిందన్నారు. అంగన్వాడీ మొబైల్ యాప్‌లో తప్పులు సరిచేసేందుకు  ఎన్‌హెచ్‌టీఎస్ డిలీట్ ఆప్షన్‌ను నేరుగా టీచర్లకే కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు శ్రీదేవి, సరోజ, రమాదేవి, భవాని, ప్రమీల, కమల తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు