సెప్టెంబర్ 25న దేశవ్యాప్తంగా వందేమాతరం గానం చేద్దాం
కొత్తపల్లి, సెప్టెంబర్20(విజయక్రాంతి): దేశ సమగ్రత, ఐక్యత, జాతీయ భావనను చాటిచెప్పే విధంగా సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం 11 గంటలకు దేశవ్యాప్తంగా ప్రతి భారతీయుడు ఒకే సమయంలో “వందేమాతరం(Vande Mataram)” గీతాన్ని ఆలపించాలని ఇంజనీర్ కోల అన్నారెడ్డి పిలుపునిచ్చారు.
విద్యాభారతీ అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం దేశ ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, మనలోని సమగ్రత, ఐక్యత, దేశభక్తి భావాలను చాటిచెప్పే గొప్ప ప్రయత్నం అని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా కరీంనగర్ నగరంలోని ప్రతి పాఠశాలలో, విద్యాసంస్థలో, వివిధ సంస్థల్లో, కార్యాలయాల్లో మరియు బహిరంగ ప్రదేశాల్లో సెప్టెంబర్ 25న ఉదయం 11 గంటలకు వందేమాతరం గీతాన్ని సామూహికంగా ఆలపించాలని ఆయన కోరారు.
దేశవ్యాప్తంగా ఒకే సమయంలో లక్షలాది, కోట్లాది మంది భారతీయులు వందేమాతరం ఆలపించడం ద్వారా “ఒకే గీతం – ఒకే దేశం – ఒకే హృదయం” అనే ఐక్యతా సందేశాన్ని ప్రపంచానికి చాటవచ్చని ఇంజనీర్ కోల అన్నారెడ్డి అన్నారు.ప్రతి పౌరుడు ఈ కార్యక్రమంలో భాగస్వామి కావాలని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, వివిధ సంస్థల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.“వందేమాతరం మన జాతీయ భావనకు ప్రతీక. సెప్టెంబర్ 25న ఉదయం 11 గంటలకు మనమందరం ఒకే స్వరంతో వందేమాతరం ఆలపించి దేశ ఐక్యతను చాటుదాం” అని ఆయన అన్నారు.