క్షేత్రస్థాయిలో చేయూత దరఖాస్తుల పరిశీలన
ఇంటింటికి వెళ్లి దరఖాస్తులను పరిశీలిస్తున్న అధికారులు..
ఉట్నూర్, సెప్టెంబర్ 22( విజయక్రాంతి ): చేయూత పింఛన్లకు (Pensions) దరఖాస్తులు చేసుకున్న వారి ఇండ్లకు వెళ్లి అధికారులు పరిశీలిస్తున్నారు. లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని నిర్ణయించిన సర్కార్ వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు విచారణ చేయిస్తుంది. ఈనెల 25 లోగా చేయూత పింఛన్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో మండలాల పరిధిలోని అర్హులైన జాబితాను , వారి దరఖాస్తులను తీసుకువెళ్లి అధికారులు విచారణ ముమ్మరం చేశారు.
లబ్ధిదారులు చేసుకున్న దరఖాస్తులతోపాటు వాటి వెంట జతచేసిన ధ్రువపత్రాలను గ్రామ కార్యదర్శులు ఆన్లైన్లో నమోదు చేశారు. విచారణ చేసే అధికారులు చెరవాణిలో ఉన్న చేయూత యాప్ లో లబ్ధిదారుని ఇంటికి వెళ్లి దరఖాస్తు ఫారాన్ని ఓపెన్ చేసి వివరాలను సరిచూస్తున్నారు. వితంతువులకు భరత మరణ ధ్రువీకరణ పత్రం, ఒంటరి మహిళలకు తహసిల్దార్ ఇచ్చిన ధృవపత్రం, వికలాంగులకు సదరం, నేత గీత కార్మికులకు సంబంధించి అధికారులు జారీ చేసిన సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నారు. బోద వ్యాధి ఉన్నవారికి వైద్యులిచ్చిన సర్టిఫికెట్లు సరి అయినవే ఉన్నాయా లేదా భూమి వివరాలు చూస్తున్నారు. చివరగా లబ్ధిదారులు పింఛన్లకు అర్హులా కాదా అని పిక్ చేసే వారి ఫోటోలు యాప్ లో అప్లోడ్ చేస్తున్నారు.
జిల్లాలో 13800 దరఖాస్తులు...
చేయూత పింఛన్లు పొందుటకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసేందుకు ఈనెల 16వ తేదీ గడువు ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన 16వ తేదీ వరకు అదిలాబాద్ జిల్లాలో ని వివిధ మండలాల పరిధిలోని గ్రామాల నుండి 13800 చేత దరఖాస్తులు వచ్చినట్లు డి ఆర్ డి ఓ కార్యాలయంలోని చేయూత పింఛన్లు పర్యవేక్షించే డిపిఎం జాదవ్ శేష రావు తెలిపారు. చేయూత పింఛన్ కోసం దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల ఇంటికి అధికారులు నేరుగా వెళ్లి చేయూత పింఛన్ యాప్ లో అర్హులా లేదా అనే విషయాన్ని గుర్తించి టిక్ చేసిన వారికి ప్రభుత్వం తప్పనిసరిగా చేయూత పింఛన్లు మంజూరు చేస్తుందని డిపిఎం తెలిపారు.