Breaking News

సీసీఐ పునఃప్రారంభంపై ఎంపీ, ఎమ్మెల్యే స్పందించాలి

09-09-2026 | 04:20pm

ఆదిలాబాద్, (విజయక్రాంతి) : సీసీఐ పునఃప్రారంభంపై ఎంపీ, ఎమ్మెల్యే స్పందించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభం కోసం చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు 32వ రోజుకు చేరుకోగా బుధ వారం న్యూ హౌసింగ్ బోర్డు, సంజీయ్ నగర్ కలోని వాసులు రిలే నిరాహార దీక్షలో కూర్చోగా శిబిరాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సందర్శించి దీక్షాదారులకు సంఘీభావం తెలిపారు. సీసీఐ పునఃప్రారంభం కోసం పోరాటం చేస్తున్న వారిని అభినందించారు. ఈ సందర్భంగా జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ..ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న నగేష్ అప్పటి ఉద్యమంలో మాజీ మంత్రి జోగు రామన్నతో కలిసి కేంద్ర మంత్రులను కలిసి సీసీఐ పునః ప్రారంభంపై  కేంద్రంపై ఒత్తిడి పెంచిన ఆయన ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్‌తో కలిసి ఇప్పుడు సీసీఐ పునఃప్రారంభం కోసం కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు.

ఆదిలాబాద్ జిల్లా ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న సీసీఐ పరిశ్రమను తిరిగి ప్రారంభించేందుకు మాజీ మంత్రి జోగు రామన్న అప్పటి ఎంపీ నగేష్‌తో కలిసి పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తులు చేశారని తెలిపారు. అయితే సీసీఐ పునఃప్రారంభంపై కేంద్రం నుంచి స్పష్టమైన చర్యలు లేకపోవడంతో ప్రజలు నిరాశకు గురయ్యారని, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌ఐపాస్ ద్వారా సీసీఐ పరిశ్రమను పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని, కేంద్ర ప్రభుత్వానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖలు రాసినా స్పందన రాలేదని ప్రేమేందర్ పేర్కొన్నారు. అందుకే ప్రస్తుతం సీసీఐ పునఃప్రారంభం కోసం ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారని తెలిపారు.

ఆదిలాబాద్ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో మాజీ మంత్రి జోగు రామన్న ఐటీ టవర్ ఏర్పాటు చేసి సుమారు రెండు వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించేలా కృషి చేశారని అన్నారు. అలాగే రేణుక పరిశ్రమను ప్రారంభించే దశలో ప్రస్తుత ఎమ్మెల్యే పాయల శంకర్ అడ్డుపడ్డారని ఆయన ఆరోపించారు. సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభం కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమంలో భాగస్వాములు కావాలని జోగు ప్రేమేందర్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష అయిన సీసీఐ పునఃప్రారంభం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇజ్జగిరి నారాయణ, గండ్రత్ రమేష్, లోకారి పోశెట్టి, మెట్టు ప్రసాద్, ఆత్రం వెంకటేష్, ఈశ్వర్ దాస్, అశోక్ స్వామి, పవన్ నాయక్, విలాస్, సృజన్ రెడ్డి, సురేందర్, కలీం, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు