5 September, 2026 | 2:57 AM

భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

04-09-2026 | 12:38pm

భద్రాచలం, సెప్టెంబర్ 4, (విజయక్రాంతి): భద్రాద్రి జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా భద్రాచలం(Bhadrachalam) శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని శుక్రవారం తెలంగాణ రెవిన్యూ, గృహ నిర్మాణ,సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit), భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్(MLA Tellam Venkatrao), పాయం వెంకటేశ్వర్లు,జారే ఆదినారాయణలతో కలసి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానానికి చేరుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దేవాలయానికి చేరుకున్నారు.

మంత్రి పొంగులేటిని భద్రాచలం ఐటీడీఏ పీ.ఓ రాహుల్,ఆలయ ఈ.ఓ దామోదర్, తహసీల్దార్ రవి కుమార్, ఆలయ అధికారులు, అర్చకులు, ఘనస్వాగతం పలికారు. వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, మంత్రి పొంగులేటి  సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేసి ఆశీర్వదించారు.

అనంతరం  దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పున నిర్మాణ పనులను మంత్రి పొంగులేటి క్షుణ్ణంగా పరిశీలించారు.చిత్రకూట మండపం పరిసరాలను,గోశాల ప్రాంతాన్నీ,అన్నదాన సత్రం,విస్తా కాంప్లెక్స్, శివాలయానికి వెళ్లే మార్గం, ఉత్తర ద్వార దర్శనం, రామాలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి  పనులు మాడవీధులను, పరిసర ప్రాంత అభివృద్ధి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

అభివృద్ధికి సంబంధించిన వివరాలను సంబంధిత అధికారుల నుంచి  అడిగి తెలుసుకున్నారు. కాంట్రాక్టర్స్(Contractors) ను, ఆర్కిటెక్చర్లను సకాలంలో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా ఆదేశించారు.ఈ ఏడాది డిసెంబర్ నెలలో జరిగే ముక్కోటి ఉత్సవాలలోపు ఉత్తర ద్వారా  అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, వచ్చే ఏడాది ఏప్రిల్ లో జరగనున్న  శ్రీరామనవమి ఉత్సవాలలోపు అన్ని పనులు పూర్తయ్యాలా చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు.  

అదేవిధంగా వచ్చే ఏడాది 2027 జూన్ - జులై నెలలో జరిగే గోదావరి పుష్కరాల ప్రారంభంలోపు గోదావరి పరివాహక ప్రాంతంలో గల గోదావరి ఘాట్లు నిర్మాణాలు అభివృద్ధి పనులు పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.రు. 276 కోట్ల నిధులు ఆలయ పరిసరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం  మంజూరు చేసిందని మంత్రి పొంగులేటి తెలిపారు.  ఎటువంటి నాణ్యతా లోపాలు లేకుండా, దశాబ్దాల కాలం పాటు నిర్మాణాలు ప్రతిష్టంగా ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు.

 దక్షిణాయోధ్యగా పేరు గడించిన భద్రాచలం పుణ్యక్షేత్రం ఆలయ అభివృద్ధికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాది జరిగిన శ్రీరామ నవమి ఉత్సవాలలో పాల్గొని ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి వెంట వివిధ శాఖల అధికారులు,ఆలయ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు