ఒక వైపు సంబరాలు- మరో వైపు నిరసనలు
ముస్తాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఏర్పడి 1000 రోజులు పూర్తయిన వేళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Siricilla District) కాంగ్రెస్ నాయకులతో ముస్తాబాద్ మండల నాయకులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రజా పాలనలో 6 గ్యారంటీలు ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అన్నీ అమలు చేస్తున్నారని నాయకులు పేర్కొన్నారు.
రైతులకు రుణమాపీ, ఉచిత విద్యుత్,మహిళలకు సిలిండర్ పై సబ్సిడీ,ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లకు ఆర్థిక సాయం అందిస్తూ అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు, ప్రభుత్వ సంస్థల బలోపేతం చేయడం ఇవన్నీ ప్రజల్లో కాంగ్రెస్ కు వస్తున్న ఆదరణ చూసి బిఆర్ఎస్ నాయకులు ఓర్వలేక అసత్య ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు.కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదలకు అండగా ఉంటూ వారి అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు.
1000 రోజుల పాలనలో ఒరిగింది ఏమిలేదు?
కాంగ్రెస్ నాయకుల మోస పూరిత హామీలపై సమరభేరి చేపట్టాలని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెళ్లు వెత్తుతున్నాయి.అందులో భాగంగానే శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల(Mustabad Mandal) కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు వంటావార్పు చేపట్టారు.ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో 1000 రోజులు పూర్తయిన కూడా తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమి లేదన్నారు.
రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదన్నారు. రాష్ట్ర ప్రజలకు 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి నెరవేరుస్తమని చెప్పి మోసం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడానికి నిరసనలు చేపట్టడం జరుగుతుందన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం కెసిఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, రాష్ట్రంలో నీటి సమస్య, విద్యుత్ సమస్య లేకుండా చేశారన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా ప్రతి ఇంటికి అందించడం జరిగిందన్నారు.






