జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
బ్లాక్ స్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ అనురాగ్ జయంతి...
ఆలేరు, అక్టోబర్ 19 (విజయక్రాంతి): బీబీనగర్ నుంచి ఆలేరు వరకు జాతీయ రహదారిపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి(Collector Anurag Jayanti) అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డితో కలిసి సోమవారం రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్ స్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలు సంభవించడానికి గల కారణాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. రహదారి పరిస్థితులు, ప్రమాదాలకు దారితీస్తున్న ఇతర అంశాలను గుర్తించి, భవిష్యత్తులో ప్రమాదాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు. జిల్లా పోలీసు యంత్రాంగం, నేషనల్ హైవే అథారిటీ, రోడ్డు భద్రతా కమిటీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
ప్రమాదకర ప్రాంతాల్లో అవసరమైన రహదారి భద్రతా ఏర్పాట్లను గుర్తించాలని, వాహనదారులకు ముందస్తు హెచ్చరికలు, అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రమాదాల తీవ్రతను తగ్గించేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ చర్యలను గుర్తించి అమలు చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.