ఊపిరితిత్తుల సమస్యలపై జాగ్రత్త!
చలికాలంలో అప్రమత్తత అవసరం
అపోలో ఆస్పత్రి డాక్టర్ విజయ్‌కుమార్
హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గడంతో ఆస్తమా, బ్రాంకైటిస్, న్యుమోనియా, సీఓపీడీ వంటి శ్వాసకోశ సమస్యలు తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని అపోలో ఆస్పత్రుల సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, క్రిటికల్ కేర్, స్లీప్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ విజయ్ కుమార్(Dr Vijay Kumar) చెన్నంచెట్టి తెలిపారు.
చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ బిగుతు, పిల్లికూతలు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. తీవ్రమైన శ్వాస ఇబ్బంది, ఛాతీనొప్పి, పెదవులు నీలంగా మారడం వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. వైద్యుల సూచన మేరకే ఇన్హేలర్లు, ఇతర మందులు వాడాలని, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ నిర్ధారణైనప్పుడే యాంటీబయాటిక్స్ తీసుకోవాలని తెలిపారు.